Sudip Roy Barman: మొదటిసారే పరాజయం.. ఆ తర్వాత అన్నీ విజయాలే..!

సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ (Sudip Roy Barman) త్రిపుర (Tripura)లోని అగర్తల (Agartala) నియోజవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తొలిసారి ఎన్నికల్లో పరాజయం పాలైన ఆయన.. ఆ తర్వాత ఇప్పటి వరకు ఓటమి చవికూడలేదు.

Published : 02 Mar 2023 19:53 IST

అగర్తల: తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే పరాజయం పలకరించింది. కానీ, ఆయన నిరుత్సాహ పడలేదు. మరింత కష్టపడి ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు వరుస విజయాలే.. పరాజయం ఆయన పరిసరాల్లోకి కూడా రాలేదు.  ఎన్ని పార్టీలు మారినా.. ప్రజలు మాత్రం ఆయనకే జై కొట్టారు. తాజా ఎన్నికల్లో భాజపా అభ్యర్థిపై 8000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయనే 56 ఏళ్ల సుదీప్‌ రాయ్‌ బర్మన్‌ (Sudip Roy Barman). త్రిపుర అసెంబ్లీ (Tripura Assembly)కి అగర్తల (Agartala) నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి సమీర్‌ రంజన్‌ బర్మన్‌ తనయుడే సుదీప్‌ రాయ్‌. జాతీయ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగం (ఎన్‌ఎస్‌యూఐ) నాయకుడిగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయి వరకు ఎదిగారు. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన సుదీప్‌ రాయ్‌ పరాజయం పాలయ్యారు. మాజీ ముఖ్యమంత్రి నృపేన్‌ చక్రబర్తి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1998లో తొలిసారి విజయం సాధించిన ఆయన.. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలుపొందారు. 2016 వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగిన సుదీప్‌ రాయ్‌.. సీపీఎంతో కాంగ్రెస్‌ పొత్తును నిరసిస్తూ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు.  సంవత్సరం తర్వాత భాజపాకి మకాం మార్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో  త్రిపురలో భాజపా విజయం సాధించిన తర్వాత.. అప్పటి ముఖ్యమంత్రి బిప్లబ్‌ దేబ్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అనతి కాలంలోనే అతడిని మంత్రి వర్గం నుంచి భాజపా తొలగించింది.

ఆ తర్వాత నుంచి భాజపాలో కేవలం ఎమ్మెల్యేగానే కొనసాగిన సుదీప్‌ రాయ్.. గత ఏడాది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరిపోయారు. అయితే, ఏ కారణంతో కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయారో.. తిరిగి వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ సీపీఎంతో పొత్తుపెట్టుకోవడం గమనార్హం. తాజా ఎన్నికల్లో భాజపా అభ్యర్థిపై సుదీప్‌రాయ్‌ 8000 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ఎన్నిసార్లు పార్టీలు మారినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా అగర్తల ప్రజలు మాత్రం సుదీప్‌ రాయ్‌ విశ్వసనీయతకే ఓటు వేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజా ఎన్నికల్లో త్రిపురలోని మొత్తం 60 శాసనసభ స్థానాలకు గానూ భాజపా 33, కాంగ్రెస్‌-వామపక్షాల కూటమి 14, టీఎంపీ 13 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని