ShivSena: ఉద్ధవ్‌ గుర్తు త్రిశూలమా? ఉదయించే సూర్యుడా?

ఠాక్రే వర్గం మూడు పేర్లు, మూడు గుర్తులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. వాటిలో ఏదో ఒకదానిని తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఠాక్రే వర్గం ఎంపిక చేసిన గుర్తుల్లో  త్రిశూలం, ఉదయించే సూర్యుడు, టార్చ్‌ గుర్తులు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Published : 10 Oct 2022 01:07 IST

దిల్లీ: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్‌ శిందే వర్గాల మధ్య వివాదాలతో శివసేన పార్టీ  గుర్తు ‘ విల్లు-బాణం’ కేటాయింపుపై ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం శివసేన గుర్తును శనివారం తాత్కాలికంగా స్తంభింపజేసింది. దీంతో  తూర్పు అంధేరి నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో ఇరు వర్గీయులు కొత్తపేరు, నూతన చిహ్నంతో బరిలోకి దిగడం అనివార్యమైంది. అయితే, తాజా ఉప ఎన్నికలో శిందే వర్గం బరిలోకి దిగడం లేదు.. వారి మద్దతులో భాజపా అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అందువల్ల ఉద్ధవ్‌ వర్గీయులు మాత్రమే కొత్త పేరు, చిహ్నాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

తాజాగా ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మూడు పేర్లు, మూడు గుర్తులను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అందులో ఒకదానిని తమకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. శివసేన బాలసాహెబ్‌ ఠాక్రే, శివసేన ఉద్ధవ్‌ బాలసాహెబ్‌ ఠాక్రే, శివసేన బాలసాహెబ్‌ ప్రభోదాంకర్‌ ఠాక్రే పేర్లను సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, టార్చ్‌ గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. గతంలో వివిధ గుర్తులతో పోటీ చేసిన శివసేన పార్టీకి 1989లో ఎన్నికల సంఘం విల్లు-బాణం గుర్తును కేటాయించింది. అయితే ఉద్ధవ్‌, శిందే వర్గాల మధ్య విభేదాల నేపథ్యంలో శనివారం ఆ గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది.

మహారాష్ట్ర శివసేనలో ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో రాష్ట్రంలో ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత భాజపా మద్దతుతో శిందే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు ‘విల్లు-బాణం’ తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఎమ్మెల్యేల అనర్హత, పార్టీ వ్యవహారాలకు సంబంధించి పలు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున శిందే వినతిపై తదుపరి చర్యలేమీ తీసుకోకూడదని ఠాక్రే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది. అయితే దీనికి సుప్రీంకోర్టు నిరాకరించింది. శిందే వినతిని పరిశీలించేందుకు ఎన్నికల సంఘానికి అనుమతిచ్చింది. ఠాక్రే, శిందే వర్గాల్లో ఎవరిది అసలైన శివసేన అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుందని తేల్చి చెప్పింది. నవంబరులో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమస్య ఓ కొలిక్కి రాకపోవడంతో ఎన్నికల సంఘం శివసేన గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం  నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని