Telangana News: తెరాస అధిష్ఠానం స్పందించకపోతే పార్టీని వీడతా: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

తెరాస పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పలువురు స్థానిక నేతలతో కలిసి అశ్వారావుపేట ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ...

Updated : 21 Jun 2022 15:17 IST

అశ్వారావుపేట: తెరాస పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. పలువురు స్థానిక నేతలతో కలిసి అశ్వారావుపేట ప్రెస్‌ క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగిన రాజ్యసభ సభ్యలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిల కృతజ్ఞత సభకు సంబంధించిన ఫ్లెక్సీల్లోనూ తన ఫొటో వేయలేదని వాపోయారు.

‘‘2018లో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వగ్రామమైన గండుగులపల్లిలోనూ ఓట్లు వేయించలేకపోయారు. ఇతర నియోజకవర్గాల్లో ఓట్లు వేయించే స్థాయి తుమ్మలకు లేదు. ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలనలో గిరిజన ప్రజా ప్రతినిధులకు అవమానాలే ఎదురయ్యాయి. నేను 1981లోనే సర్పంచ్‌గా గెలిచిన సీనియర్‌ నాయకుడిని. ఈ విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సైతం నాకు జూనియర్‌ అవుతారు. ఇటీవల ఖమ్మం పర్యటనలో నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని జిల్లా నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేసినప్పటికీ అయన ఆదేశాలు ఎక్కడా అమలు కాలేదు. ఇప్పటికైనా అధిష్ఠానం స్పందించకపోతే పార్టీని వీడటం ఖాయం’’ అని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని