Kalvakuntala Kavitha: మాపై ఈడీ, సీబీఐ కేసులు.. నీచమైన రాజకీయ ఎత్తుగడ: ఎమ్మెల్సీ కవిత

తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Updated : 01 Dec 2022 13:11 IST

హైదరాబాద్‌: తనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐలు కేసులు పెట్టడం భాజపా హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని నివాసం వద్ద మీడియాతో ఆమె మాట్లాడారు.

‘‘దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు అవుతోంది. 9 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో భాజపా అధికారంలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తున్నాం. మోదీ కంటే ముందు ఈడీ ఆయా రాష్ట్రాలకు వెళ్లడాన్ని చూస్తున్నాం. వచ్చే డిసెంబర్‌లో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ఉన్నందున మోదీ కంటే ముందు ఈడీ ఇక్కడికి వచ్చింది. అది నార్మల్‌. నాపై కావొచ్చు.. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు హీనమైన ఎత్తుగడ. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి విచారణకైనా మేం సిద్ధం. 

ఆయా ఏజెన్సీలు వచ్చి అడిగితే తప్పకుండా జవాబు ఇస్తాం. అంతేకానీ మీడియాలో లీకులు ఇచ్చి నేతలకు ఉన్న మంచి పేరు చెడగొట్టాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు తిప్పికొడతారు. ఈ పంథాని మార్చుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలకు మనమేం చేస్తామో చెప్పుకొని గెలవాలి తప్ప.. ఈడీ, సీబీఐలను ప్రయోగించి కాదు. అత్యంత చైతన్యవంతమైన ప్రజలు ఉన్న తెలంగాణలో మీకు అది సాధ్యపడదు. కాదు కూడదు అని జైల్లో పెడతామంటే పెట్టుకోండి.. ఏమవుతుంది? భయపడేదేముంది? ప్రజలు మా వెంట ఉన్నంతకాలం.. ప్రజల కోసం తెరాస చిత్తశుద్ధితో పనిచేస్తున్నంతకాలం ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ రాదు’’ అని కవిత వ్యాఖ్యానించారు.

కవిత ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో ఆమె ఇంటి వద్దకు పెద్ద ఎత్తున  తెరాస నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. కవితకు అనుకూలంగా భాజపాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని