Telangana News: ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలను అవమానించారు: కె.కేశవరావు

ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) అన్నారు...

Updated : 09 Feb 2022 11:04 IST

దిల్లీ: ఎన్నో ఏళ్ల ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) అన్నారు. విస్తృత అధ్యయనం తర్వాతే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఏపీ విభజనను ఉద్దేశించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తెరాస ఎంపీలు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. మోదీ తన ప్రసంగంలో అసందర్భంగా తెలంగాణ ఏర్పాటును ప్రస్తావించారని.. రాష్ట్ర ప్రజలను ఆయన అవమానించారని కేకే విమర్శించారు.

పార్లమెంట్‌లో కీలక బిల్లులపై ఓటింగ్‌ జరిగితే సభ్యుల లెక్కింపు తప్పకుండా జరుగుతుందని కేశవరావు అన్నారు. రాష్ట్ర విభజన బిల్లుకు భాజపా మద్దతు ఇచ్చిందని.. అధికార, విపక్ష పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చినపుడు సంఖ్యా బలం సమస్య ఉత్పన్నం కాదని చెప్పారు. లోక్‌సభలో 2/3 వంతు మెజార్టీ చూసిన తర్వాతే బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించారన్నారు. ఉభయ సభల ఆమోదం తర్వాత తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందని వివరించారు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని కేకే ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో భాజపా చెప్పాలని ఆయన నిలదీశారు.

తెలంగాణ ఏర్పాటు ప్రశాంతంగానే జరిగింది..

రాష్ట్రాల విభజన భావోద్వేగంతో కూడుకున్నదని కేకే చెప్పారు. ఝార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కొందరు సభ్యులు అప్పటి ప్రధాని వాజ్‌పేయీపైకి దూసుకెళ్లారని.. అప్పుడు ఎంపీగా ఉన్న ఆనంద్‌మోహన్‌ చేయి కూడా విరిగిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ విషయానికొస్తే కొందరు సభ్యులు స్ప్రే కొట్టడం మినహా తెలంగాణ ఏర్పాటు ప్రశాంతంగానే జరిగిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని