Telangana News: కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపార కోణంలోనే చూస్తోంది: కె.కేశవరావు

బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదంటూ కేంద్రం అబద్ధాలు చెప్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఆరోపించారు.

Updated : 04 Apr 2022 17:36 IST

దిల్లీ: బియ్యాన్ని ఎగుమతి చేయట్లేదంటూ కేంద్రం అబద్ధాలు చెప్తోందని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు (కేకే) ఆరోపించారు. పారా బాయిల్డ్‌ రైస్‌ను కేంద్రం ఎగుమతి చేస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణలో ధాన్యం ఎందుకు సేకరించడం లేదని ప్రశ్నించారు. దిల్లీలో తెరాస ఎంపీలతో నిర్వహించిన మీడియా సమావేశంలో కేకే మాట్లాడారు. 

గత ఏడేళ్లుగా దేశంలో ప్రైవేటీకరణ విపరీతంగా పెరిగిందని.. కేంద్రం ప్రతి అంశాన్నీ వ్యాపారం, లాభం కోణంలోనే చూస్తోందని విమర్శించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలును ప్రజా సంక్షేమం కోణంలో చూడాలని కేంద్రాన్ని కోరామన్నారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి దేశాలు పారా బాయిల్డ్‌ రైస్‌ అడుగుతున్నాయని.. ఇలాంటి సమయంలో కేంద్రం సేకరించి ఆయా దేశాలకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ మంత్రులు ఎప్పుడూ కేంద్రమంత్రులను బెదిరించలేదని..ధాన్యం కొనుగోలు చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి మాత్రమే చేశామన్నారు.

‘‘తెలంగాణకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ధర్మ యుద్ధం నడుస్తోంది. యాసంగిలో బ్రోకెన్ రైస్‌ పండుతుందని కేంద్రానికి తెలుసు. దశాబ్దాలుగా ఎఫ్‌సీఐ కూడా సేకరిస్తోంది. ఆహార భద్రతలో సేకరించేది ఎగమతి చేయొద్దని కేంద్ర మంత్రి చెప్పారు. ఎగుమతి అనేది కేంద్రం పరిధిలోని అంశం. రాయితీలు ఉన్నవాటిని ఎగుమతి చేయలేమన్నారు. 110 దేశాలకు పారా బాయిల్డ్‌ రైస్‌ ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతికి అవకాశం ఉంది.. అక్కడ మార్కెట్‌ కూడా ఉంది. పారాబాయిల్డ్‌ రైస్‌కు బయట దేశాల్లో మార్కెట్‌ ఉంది. మార్కెట్‌ ఉన్నప్పటికీ పారా బాయిల్డ్‌ రైస్‌ ఎందుకు పంపట్లేదు? కేంద్రం ఒప్పుకునే వరకు మా యుద్ధం కొనసాగుతుంది’’ అని కేకే స్పష్టం చేశారు. 

పీయూష్‌ గోయల్‌పై సభాహక్కుల నోటీసు..

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ దేశాన్ని తప్పుదోవ పట్టించారని తెరాస ఎంపీలు ఆరోపించారు. డబ్ల్యూటీవో ఆంక్షలతో పారా బాయిల్డ్‌ రైస్‌ను విదేశాలకు ఎగుమతి చేయడం లేదంటూ ఇటీవల రాజ్యసభలో పీయూష్‌ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలు అబద్ధమని పేర్కొంటూ ఆయనపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించిన లేఖను రాజ్యసభ ఛైర్మన్‌, లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు. రూల్‌ 187 కింద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెరాస ఎంపీలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని