TRS: తెరాస రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

తెరాస రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావు,

Updated : 18 May 2022 20:00 IST

హైదరాబాద్‌: త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి పేర్లను వెల్లడించారు. తొలి నుంచీ ప్రచారంలో ఉన్న నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావుతో పాటు హెటిరో డ్రగ్స్‌ అధినేత డా.బండి పార్థసారథిరెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు. 

రాజ్యసభ ఎంపీగా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే బండ ప్రకాశ్‌ రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్‌ అవకాశం కల్పించారు. బండ ప్రకాశ్‌ రాజీనామా నేపథ్యంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో రాజ్యసభ అభ్యర్థులను సీఎం ఫైనల్‌ చేశారు. బండ ప్రకాశ్‌ స్థానంలో ఖాళీ అయిన స్థానానికి  వద్దిరాజు రవిచంద్ర రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. 

ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్‌ (డీఎస్‌), కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు పదవీకాలం వచ్చేనెలలో ముగియనుంది. ఆ స్థానాల్లోనూ ఎన్నికల నిర్వహణకు సైతం ఈసీ ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈనెల 24 నుంచి 31 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. దీంతో ఆయా స్థానాలకు మరో ఇద్దరు అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. డీఎస్‌, లక్ష్మీకాంతరావు స్థానాల్లో దీవకొండ దామోదరరావు, డా.బండి పార్థసారథిరెడ్డి ఈనెల 31లోపు నామినేషన్లు వేయన్నారు.

బీఫారాలు అందజేసిన సీఎం కేసీఆర్‌

రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర సీఎం కేసీఆర్‌ను కలిశారు. ప్రగతిభవన్‌లో సీఎంతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ వారికి రాజ్యసభ అభ్యర్థిత్వాల బీఫారాలను అందజేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని