Munugode bypoll: మునుగోడు ‘గులాబీ’ వశం.. ఫలించిన కేసీఆర్‌ వ్యూహం..!

రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll) ఫలితాల్లో తెరాస సత్తా చాటింది. ఆఖరి రౌండ్‌ వరకూ తెరాస, భాజపా మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో భాజపాపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.

Published : 07 Nov 2022 01:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నిక(Munugode bypoll) ఫలితాల్లో తెరాస సత్తా చాటింది. అధికార తెరాస, భాజపా మధ్య హోరాహోరీగా కొనసాగిన పోరులో భాజపాపై తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని సెమీ ఫైనల్‌గా భావించిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించి, సర్వశక్తుల్ని ధారపోశాయి. దేశ రాజకీయాల్లోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్న ఈ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని భాజపా తీవ్ర ప్రయత్నాలు చేయగా.. సీఎం కేసీఆర్‌ తన వ్యూహాలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి  డిపాజిట్‌ కోల్పోగా.. తెరాస-భాజపా మధ్య సాగిన ఈ ఉత్కంఠ పోరులో ‘కారు’ పార్టీ విజయానికి దోహదం చేసిన కొన్ని ముఖ్య అంశాల్ని పరిశీలిస్తే..!

ముందు నుంచే పక్కా ప్లాన్‌..

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరి పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో కొన్ని నెలల ముందు నుంచే తెరాస మునుగోడుపై దృష్టి కేంద్రీకరించింది. 2018 ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న కసితో బరిలో దిగింది. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని పక్కా వ్యూహంతో అడుగులు వేసింది. ఈ సీటును అనేకమంది నేతలు ఆశించినప్పటికీ వాళ్లను కాదని 2014లో ఇక్కడ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించింది. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత బూర నర్సయ్యగౌడ్‌ లాంటి నేతలు పార్టీని వీడి భాజపాలో చేరినా ఏమాత్రం పట్టుసడలకుండా పార్టీ శ్రేణుల్ని భారీగా మోహరించింది. మండలానికో ఇన్‌ఛార్జిని నియమించి బూత్‌స్థాయి నుంచే నేతల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని విజయం కోసం అహర్నిశలూ శ్రమించింది.

వామపక్షాల మద్దతు

మునుగోడులో విజయం సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్న భాజపా నేతల ఆశలపై కేసీఆర్ వ్యూహాలు నీళ్లు చల్లాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆగస్టు 20న అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో కమ్యూనిస్టులతో పొత్తును ప్రకటించడం ఆ పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నల్గొండ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉండేది. ఈ నియోజకవర్గంలో గతంలో వామపక్షాలు ఐదు పర్యాయాలు విజయం సాధించాయి. ప్రస్తుతం వామపక్షాలు బలహీనపడినా  ఇక్కడ సీపీఎం, సీపీఐలకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. దీన్ని ముందే పసిగట్టిన  సీఎం కేసీఆర్‌ వామపక్షాల నేతలతో కలిసి మునుగోడుకు వెళ్లి సభలో పొత్తు అంశాన్ని ప్రకటించడం, ప్రచారంలోనూ వామపక్ష పార్టీల రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు చురుగ్గా పాల్గొని భాజపాకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి పరిణామాలు తెరాస అభ్యర్థి విజయానికి దోహదపడ్డాయి.

అభివృద్ధి పథకాలు.. పోల్‌ మేనేజ్‌మెంట్‌

మునుగోడులో భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించి రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను చూపించి ఓట్లు అడిగింది. మిషన్‌ భగీరథ, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, రైతుబీమా తదితర పథకాలన్నింటినీ ప్రచారంలో భాగంగా చేసుకోవడంతో పాటు పోలింగ్‌ దగ్గరపడుతున్న సమయంలో చేపట్టిన పక్కా పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. కేసీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో వరుస సమావేశాలతో పాటు కేటీఆర్‌ వరుస పర్యటనలు, నియోజకవర్గంలో పెండింగ్‌ సమస్యలపై దృష్టి, గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించడం వంటివి అధికార పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.

ఫ్లోరైడ్‌ అంశం.. మునుగోడు దత్తతకు కేటీఆర్‌ హామీ

దేశంలోనే భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ ఎక్కువగా ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. ఈ ఫ్లోరైడ్‌ రక్కసిని పారదోలడానికి సీఎం కేసీఆర్‌ మిషన్‌ భగీరథను నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించారు. గత నాలుగైదేళ్లలో ఒక్క ఫ్లోరైడ్‌ కేసు కూడా నమోదు కాకపోవడం వంటి అంశాలను తెరాస ప్రధానంగా ఈ ఎన్నికల్లో ప్రస్తావించింది. ఇతర పార్టీలు ఈ ప్రాంతానికి ఏం చేశాయో చెప్పాలని నిలదీసింది. తమ పార్టీకి అవకాశం ఇస్తే రూ.వేల కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెరాస నేతలు హామీలు గుప్పించారు. అంతేకాకుండా, తెరాస అభ్యర్థిని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానంటూ మంత్రి కేటీఆర్‌ హామీ ఇవ్వడం కూడా తెరాస విజయావకాశాలను పెంచింది.

రూ.18వేల కోట్ల కాంట్రాక్టు అంశం

రాజగోపాల్‌ రెడ్డి రూ.18వేల కాంట్రాక్టు కోసమే కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరారని.. ఆయన వ్యక్తిగత లాభం కోసమే ఈ ఎన్నికలు వచ్చాయని ఆరోపిస్తూ తెరాస జోరుగా ప్రచారం చేసింది. దీనికి తోడు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకొని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్‌ను తిట్టి ఓట్లు అడగడం తప్ప రాష్ట్రానికి/మునుగోడుకు కేంద్ర ప్రభుత్వం నుంచి భాజపా నేతలు ఏమైనా తీసుకొచ్చారా? అని సూటిగా ప్రశ్నించడంతో పాటు గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ నియోజకవర్గాలకు నిధులు తెస్తామని చెప్పి మోసం చేశారంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.  అలాగే, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కాంట్రాక్టుల పేరిట ఇవ్వాలనుకున్న ఆ రూ.18వేల కోట్లు మునుగోడు అభివృద్ధి కోసం ఇస్తామని మోదీ, అమిత్ షా హామీ ఇస్తే తాము ఉప ఎన్నిక నుంచి  వైదొలుగుతామని కూడా మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ చేశారు.

‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ వ్యవహారం!

తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు వ్యవహారం కూడా మునుగోడు ఉప ఎన్నికపై ప్రభావం చూపినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాల వీడియో, ఆడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ అంశాన్ని తెరాసకు తన ప్రధాన ప్రత్యర్థిపై ఓ అస్త్రంగా ఉపయోగించుకుంది. రైతులు పండించిన వడ్లు కొనరు గానీ తెరాస ఎమ్మెల్యేలను రూ.కోట్లతో కొనుగోలు చేసేందుకు భాజపా నేతలు సిద్ధమయ్యారంటూ తెరాస నేతలు పదే పదే విమర్శలు ఎక్కుపెట్టడంతో పాటు చేనేత కార్మికులకు బీమా ప్రకటించడం, చేనేతపై జీఎస్టీకి వ్యతిరేకంగా కేంద్రంపై కేటీఆర్‌ విమర్శలు, వివిధ సామాజిక వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రకటించిన పలు హామీలు తెరాస విజయంలో కీలక పాత్ర పోషించాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని