MLC ELECTION: తెలంగాణలో ఎమ్మెల్సీ ఆశావహులకు నిరాశ

తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందా అని ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే మిగిలింది. తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

Updated : 12 Oct 2022 14:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందా అని ఎదురు చూస్తున్న ఆశావహులకు నిరాశే మిగిలింది. తెలంగాణలో శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఆరుగురు ఎమ్మెల్సీల పదవీకాలం జూన్‌ 3వ తేదీతో ముగిసింది. గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత.. పదవీకాలం పూర్తయిన వారిలో ఉన్నారు. గవర్నర్ కోటాలో నామినేట్ అయిన తెలంగాణ భవన్ ఇంఛార్జి ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీ కాలం జూన్ 16 నాటికి ముగిసింది.

సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో జూన్‌ మూడో తేదీ నుంచి ఆ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈసీ లేఖకు సమాధానమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 600కు పైగా నమోదు అవుతుండటం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సబబు కాదని వివరించినట్టు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. దానిపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇప్పటికే పలువురికి హామీలు..

ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులపై పలువురికి హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నేత కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేస్తానని స్వయంగా బహిరంగ సభలోనే కేసీఆర్ ప్రకటించారు. సుఖేందర్‌రెడ్డిని కొనసాగిస్తే.. సామాజిక సమీకరణల్లో కోటిరెడ్డికి అవకాశం ఇస్తారా..? వేచి చూస్తారా..? అని పార్టీ నాయకులు విశ్లేషిస్తున్నారు. విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, రజక, పద్మశాలీలకు ఎమ్మెల్సీ ఇస్తామని గ్రేటర్‌ ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చారు. మాజీ స్పీకర్ మధుసూదనచారికి ఎమ్మెల్సీ ఖాయమని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే ఒకే జిల్లాకు చెందిన బోడకుంటి వెంకటేశ్వర్లుకు మరేదైనా పదవి దక్కొచ్చు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్​ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి పేర్లు ఎమ్మెల్సీ ప్రచారంలో ఉన్నాయి.  అందరూ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. ఇటీవల తెరాసలో చేరిన ఎల్‌.రమణకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. తెరాస ఎమ్మెల్యేల సంఖ్యాబలం దృష్ట్యా అన్ని స్థానాలు ఏకగ్రీవమవడం లాంఛనమే కావడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని