
TS News: కేంద్రం మన నిధులే మనకివ్వడం లేదు: మంత్రి ఎర్రబెల్లి
ఐనవోలు: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువని చెప్పారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు అధికారులు ముందుండాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్నింటా ఇబ్బంది పెడుతోందని..మన నిధులే మనకి ఇవ్వడం లేదన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూ.2.70లక్షల కోట్లు చెల్లిస్తుంటే తిరిగి మనకి రూ.1.30లక్షల కోట్లు మాత్రమే ఇస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు.