Telangana News: భాజపాకు బీ టీమ్‌గా వైకాపా.. ఏపీ మంత్రులపై గంగుల ఫైర్‌

తెరాస ప్రభుత్వంపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Updated : 01 Oct 2022 18:42 IST

కరీంనగర్‌: తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలతో మొదలైన ఈ ఎపిసోడ్‌ రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెరాస ప్రభుత్వంపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్‌, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ కౌంటర్‌ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌రావును టార్గెట్‌ చేసి వైకాపా మంత్రులు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

 ‘‘తెలంగాణ, తెరాసపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మా సీఎం, ప్రభుత్వం జోలికి వస్తే తీవ్రంగా స్పందిస్తాం. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడేవాళ్లకు హెచ్చరిస్తున్నా.. మా జోలికి రావొద్దు. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టేలా జగన్‌ ప్రభుత్వం చూస్తోంది. జగన్‌ పార్టీ భాజపాకు బీ టీమ్‌గా వ్యవహరిస్తోంది. సజ్జల, అమర్నాథ్‌.. తెరాస, హరీశ్‌రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు సజ్జల మాతో పెట్టుకుంటున్నారు. మా సంగతి తెలియదా? గతంలో చూశారు మళ్లీ చూస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డిది కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధి. వైఎస్‌ కుటుంబంలోకి వచ్చి తల్లి, కుమారుడు, చెల్లిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. కేసీఆర్‌ కుటుంబాన్ని సజ్జల విడగొట్టాలనుకున్నా ఏమీ చేయలేరు. జగన్‌ ప్రభుత్వం ఫెయిల్‌ అయింది.. అందుకే తెలంగాణకు వలసలు పెరిగాయి. సజ్జల ప్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ పథకాలు ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు’’ అని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై వైకాపా మంత్రులు బొత్స, అమర్నాథ్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని