Harishrao: మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేరు: హరీశ్‌రావు

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదేళ్లయిన పూర్తి చేయలేరని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం ప్రారంభించినా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారన్నారు.

Updated : 13 Nov 2022 17:12 IST

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. దిల్లీలో, హైదరాబాద్‌ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుందని, గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలితాలు కళ్లకు కనిపిస్తాయన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు పనులు మరో ఐదేళ్లయిన పూర్తి చేయలేరన్నారు.‘‘పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడా. మరో ఐదేళ్లలో పూర్తయితే గొప్పేనని చెప్పారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయి ఆ ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయి. కానీ,  కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం పూర్తి కాలేదు. ఆ ఫలితం ప్రజలకు అందలేదు. కాళేశ్వరం గురించి ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ఫలాలు అందుకుంటున్న మనం ఆ అబద్ధాలను  తిప్పికొట్టి.. కాళేశ్వరం గొప్పతనాన్ని చాటిచెప్పాలి’’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

వారి తిట్లు కేసీఆర్‌ని ఎంత బలవంతుడిని చేశాయో.. 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోదీ అన్నారన్న హరీశ్ రావు... మరి భాజపా నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ని ఎంత బలవంతుడిని చేసి ఉంటాయని చమత్కరించారు. పీఎంగా దేశానికి, తెలంగాణకు మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఏం చేశారని అడిగితే తిడుతున్నారని చెబుతూ పలాయనం చేయటం ఎంత వరకూ భావ్యం మోదీజీ అంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని