Telangana News: కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతి: హరీశ్‌రావు

ఇప్పటికే రూ.వేల కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుల పునఃనిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ కోట్లాది రూపాయల అవినీతి

Published : 19 Aug 2022 01:34 IST

హైదరాబాద్‌: ఇప్పటికే రూ.వేల కోట్ల అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టులో పంపుల పునఃనిర్మాణం, మరమ్మతుల పేరుతో మళ్లీ కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందంటూ కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చేసిన ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు ఖండించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో అద్భుతమంటూ కొనియాడినవారే రాజకీయాల కోసం బురద జల్లుతున్నారని ఆరోపించారు.  కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? అని ప్రశ్నించారు. కేంద్రం తప్పులను తెరాస ప్రభుత్వం ఎత్తిచూపుతోందనే అక్కసుతోనే భాజపా దుష్ప్రచారం చేస్తోందన్న ఆయన.. ఊహించని ప్రకృతి వైపరీత్యాల వల్లే పంపులు మునిగాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది, అప్పులిచ్చింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరాన్ని గతంలో సీడబ్ల్యూసీ ఛైర్మన్‌గా ఉన్న మసూద్‌ హుస్సేన్‌ అభినందించారని గుర్తు చేశారు.  

‘‘తెరాసకు, కేసీఆర్‌కు మంచి పేరుంది. ఏదోరకంగా వీళ్లకు డబ్బులు ఆపి ఇబ్బంది పెడితే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారేమో, తద్వారా చెడ్డపేరు వస్తుందని ఒక ప్రయత్నం చేశారు. కేంద్రం ఇచ్చే డబ్బులను కూడా వదులుకున్నాం. అయినా రైతులకు ఉచిత కరెంట్‌ ఇచ్చే తీరుతామని సీఎం స్పష్టం చేశారు. కాళేశ్వరం మునిగిపోయిందని.. యాసంగికి నీళ్లు రావని తెరాస మీద బురద జల్లోచ్చని కలలు కన్నారు. కానీ, వారి కల కలగానే మిగిలిపోయింది’’ అని హరీశ్‌రావు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని