Telangana News: ఎంఎంఆర్‌ తగ్గుదలలో డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాలు వెనుకబడ్డాయి: మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అతి తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు.

Published : 30 Nov 2022 01:29 IST

హైదరాబాద్ : రాష్ట్రంలో మాతృ మరణాలు గణనీయంగా తగ్గాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అతి తక్కువ ఎంఎంఆర్‌లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టం బులిటెన్‌ 2018-20 ప్రకారం 56 నుంచి 43 పాయింట్లకు తగ్గినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్న మంత్రి.. వైద్యారోగ్యశాఖ కృషి అభినందనీయమన్నారు. ఎంఎంఆర్‌ తగ్గుదలలో డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాలు వెనుకబడ్డాయని ఎద్దేవా చేశారు. కేరళ, మహారాష్ట్ర మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనతో రాష్ట్రంలో అమలు చేస్తున్న మాతా శిశు సంరక్షణ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. మాతృ మరణాలు తగ్గించడంలో పథకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్న హరీశ్‌రావు.. కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి వాహనాలతో పాటు ఇతర సంరక్షణ చర్యలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.

రెండో విడత కంటివెలుగు కోసం రూ.200 కోట్లు

రెండో దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని జనవరి 18న ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సన్నద్ధం కావాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. మలి విడత కార్యక్రమం నేపథ్యంలో అధికారులతో మంత్రి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రెండో విడత కంటి వెలుగు కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. మొదటి దఫాలో కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేసి, 50లక్షల అద్దాలు పంపిణీ చేయగా.. రెండో దఫాలో కోటిన్నర మందికి పరీక్షలు నిర్వహించి, 55లక్షల అద్దాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు చెప్పారు. 30లక్షలు రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అవసరం ఉంటుందని అంచనా వేసినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు