KTR: పేదలకు ఇళ్లు ఇవ్వరు.. మోదీ రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు: మంత్రి కేటీఆర్‌

‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్‌మాల్‌ గుజరాత్‌ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Published : 08 Oct 2022 01:05 IST

హైదరాబాద్‌: సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ఫ్లోరైడ్‌ సమస్యను మిషన్‌ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

‘‘గోల్‌మాల్‌ గుజరాత్‌ మోడల్‌ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్‌మాల్‌ గుజరాత్‌ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్‌ కీ బాత్‌ వినరు.. మన్‌ కీ బాత్‌ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు. నైజీరియా కంటే  దారుణంగా భారత్‌ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయి. భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. భారత్‌ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ప్రతి ఒక్కరికీ తాగునీరు, విద్యుత్‌ ఉచితంగా అందిస్తాం. 

ఎస్సీలను వ్యాపారవేత్తలను చేస్తాం. సెప్టెంబర్‌ 17 లిబరేషన్‌ డే అయితే ఆగస్టు 15 ఎందుకు కాదు? 2024 పార్లమెంట్‌ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తాం. మహారాష్ట్ర, కర్ణాటకలో మాకు సానుకూలంగా ఉంది. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కేసీఆర్‌ను అవహేళన చేసినవాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్‌ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు.. వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలను బయటపెడతాం. భాజపా విలువలు లేని రాజకీయాలు చేస్తోంది. మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క భాజపా నేతపైనైనా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? తెలంగాణలో జరుగుతున్న పనిని దేశానికి చెబుతాం. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంపీలు ఆపార్టీని వీడొచ్చు...

‘‘భాజపా సొంతంగా అధికారంలోకి రావటానికి 40 ఏళ్లు పట్టింది. అధికారంలోకి రావడానికి మాకు అంత సమయం పట్టకపోవచ్చు అధికారమే పరమావధి కాదు.. ప్రజలకు ఏం కావాలో అదే మా అజెండా. కేసీఆర్‌ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం. మా పార్టీలో కంటెంట్‌, కటౌట్‌ ఉంది.. మాకు విజయం దక్కుతుంది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో కాకుండా కాంగ్రెస్‌ జోడో యాత్ర చేయాలి. తెలంగాణలో ఉన్న పరిస్థితి, పథకాలు యాత్రలో రాహుల్‌కు తెలుస్తాయి. దేశంలో రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్‌ అస్తిత్వ పోరాటం చేస్తోంది. రాహుల్‌ ఇక్కడ ఉన్నప్పుడే కాంగ్రెస్‌ ఎంపీలు ఆ పార్టీని వదిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్‌ను వీడొచ్చని వింటున్నా. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్‌ ఉంటుందన్న నమ్మకం లేదు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయారు.. ఆ పార్టీ గురించి మాట్లాడడమే వృథా.

కిషన్‌రెడ్డి ఫోన్‌ను ప్రధాని ట్యాప్‌ చేస్తున్నారు..

‘‘పైసల కోసమే రాజగోపాల్‌రెడ్డి పదవిని పణంగా పెట్టి భాజపాలో చేరారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇచ్చాకే ఆయన భాజపాలో చేరారు. రాజగోపాల్‌రెడ్డి రూ.500 కోట్లు ఖర్చుపెడతానని అమిత్‌ షాకు చెప్పినట్టు తెలిసింది. ఓటుకు రూ.30వేలు ఇచ్చి గెలుస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. మునుగోడులో 30శాతం ఓట్లు మాకు ఎక్కువగా ఉన్నాయి. మునుగోడులో మేం గెలించాం.. రెండో స్థానం కోసం కాంగ్రెస్‌, భాజపా మధ్య పోటీ. హిందూ, ముస్లిం అంటూ మోహన్‌ భగవత్‌ మాటలు పట్టించుకోం. ఆయన్ను కౌన్సిలర్‌గా గెలవమనండి చూద్దాం. 2014లో మోదీ దేశవ్యాప్తంగా 100 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2024లో కేసీఆర్‌ కూడా అలాగే ప్రచారం చేస్తారు. తెలంగాణ మోడల్‌ను కేసీఆర్‌ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు. ఇదే పాలన దేశ ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేస్తాం. నా ఫోన్‌ సహా 10వేల మందికి పైగా ఫోన్లలో పెగాసస్‌ ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ను ప్రధాని ట్యాప్‌ చేస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయం కిషన్‌రెడ్డికి తెలియదు’’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని