KTR: బండి సంజయ్‌ రాజకీయ అజ్ఞాని.. యువతను రెచ్చగొడుతున్నారు: మంత్రి కేటీఆర్‌

టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాజపా, భారాస మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బండి సంజయ్‌ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Updated : 17 Mar 2023 21:26 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన విమర్శలను భారాస వర్కింగ్‌  ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ తిప్పికొట్టారు. బండి సంజయ్‌ తెలివిలేని దద్దమ్మ, రాజకీయ అజ్ఞాని అని మండిపడ్డారు. ‘‘ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహన లేని నాయకుడు సంజయ్‌. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఒక ప్రభుత్వ శాఖ కాదు.. అది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థ అన్న కనీస అవగాహన కూడా ఆయనకు లేదు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు. నిరుద్యోగుల పట్ల మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు భాజపాకు లేదు.

ప్రశ్నపత్రం లీక్‌ చేయించిన కుట్ర ముమ్మాటికీ భాజపాదే

ఆ పార్టీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నపత్రం లీక్‌ అయింది. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా?  పేపర్‌ లీకేజీని శాంతిభద్రతల సమస్యగా మార్చేందుకు భాజపా కుట్ర చేస్తోంది. లీకేజీ నిందితులు భాజపా కార్యకర్తలని విచారణలో తేలింది. ప్రశ్నపత్రం లీక్‌ చేయించిన కుట్ర ముమ్మాటికీ భాజపాదే. కుట్రలు చేసిన సంజయ్‌ క్రిమినల్‌ కేసులు ఎదర్కోవాల్సి వస్తుంది. టీఎస్‌పీఎస్సీ ఉదంతంలో ప్రభుత్వం వేగంగా స్పందించింది. నిరుద్యోగ యువత ప్రయోజనాలు కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు టీఎస్‌పీఎస్సీకి అందిస్తాం. అర్హులకు అన్యాయం జరగొద్దనే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చేశాం. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలి’’ అని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని