Published : 06 Jul 2022 01:53 IST

Sanjay Raut: మధ్యంతర ఎన్నికలొస్తే.. 100కి పైగా సీట్లు మావే: రౌత్‌ కీలక వ్యాఖ్యలు

ముంబయి: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని.. మహారాష్ట్రలో ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు నిర్వహించినా 100కి పైగా స్థానాలు ఉద్ధవ్‌ సారథ్యంలోని శివసేన (Shiv sena) గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ (Sanjay Raut) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ను పడగొట్టి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా, ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shindhe) వర్గంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధన బలంతో, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ఒత్తిడిని పెంచడం ద్వారా శివసేనను హైజాక్‌ చేయడం సాధ్యం కాదన్నారు. మహారాష్ట్రలో ఈరోజు ఎన్నికలు జరిపినా శివసేన 100కి పైగా సీట్లు గెలుచుకుంటుందని తెలిపారు. ప్రజల్లో రెబల్‌ ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహం, పార్టీ పట్ల సానుకూలత వ్యక్తమవుతోందన్న రౌత్‌.. ఒక ఎమ్మెల్యే పార్టీని వీడినంత మాత్రాన శివసేన తన ఓటర్లను కోల్పోయినట్టు కాదన్నారు.

మరోవైపు, మహారాష్ట్ర అసెంబ్లీ కొత్త స్పీకర్‌గా ఎన్నికైన రాహుల్ నర్వేకర్‌ను ఉద్దేశించి రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రే సారథ్యంలోని శివసేన అసలైన పార్టీ అని.. ఒకవేళ తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటే మాత్రం నర్వేకర్‌ (వృత్తిపరంగా న్యాయవాది) తన లా డిగ్రీని వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో నిన్న శిందే సర్కార్‌ బలపరీక్ష నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ శిందే వర్గం శివసేన ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది. ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన తర్వాత ఉద్ధవ్‌ వర్గంలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు విప్‌ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రౌత్‌ స్పందించారు. ‘ఇదంతా చట్టపరమైన ప్రక్రియ. ఆ 14మంది ఎమ్మెల్యేలు బాలాసాహెబ్‌ శివసైనికులు. అనుచరులు’’ అని పేర్కొన్నారు. శివసేనలో తనకు సరైన గుర్తింపు దక్కలేదంటూ నిన్న శిందే అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకూ రౌత్‌ గట్టిగా కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రానికి చేసిన తానేం చేశారో వివరించడానికి బదులుగా.. పార్టీని వీడటంపై సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో శివసేన నుంచి తిరుగుబాటు చేసిన నారాయణ్‌ రణె, ఛగన్‌ భుజ్‌బల్‌ వంటి నేతల భాషనే శిందే వాడుతున్నారన్నారు. 

వచ్చే ఎన్నికల్లో భాజపా, తన సారథ్యంలోని శివసేన కలిసి మహారాష్ట్రలో 200లకు పైగా సీట్లు గెలుచుకుంటుందని, అలా జరగకపోతే తాను తిరిగి వ్యవసాయం చేసుకుంటానంటూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నిన్న అసెంబ్లీలో వ్యాఖ్యానించగా.. భాజపాకు ధైర్యం ఉంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని.. ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ప్రజా కోర్టులోనే తేల్చుకుందాం అంటూ ఉద్ధవ్‌ ఠాక్రే భాజపాకు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని