Uddhav Thackeray: ‘కావాలంటే నన్ను జైల్లో పెట్టుకోండి’.. భాజపాపై ఉద్ధవ్‌ ఫైర్‌!

మనీ లాండరింగ్‌ కేసులో తన బావమర్ది ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేయడం తనను లక్ష్యంగా చేసుకోవడమేనని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పేర్కొన్నారు.

Published : 26 Mar 2022 02:16 IST

ముంబయి: తమ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మండిపడ్డారు. ముఖ్యంగా మనీ లాండరింగ్‌ కేసులో తన (ఉద్ధవ్‌ ఠాక్రే) బావమరిది ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్తంభింపజేయడం తనను లక్ష్యంగా చేసుకోవడమేనన్నారు. తనను జైలుకు పంపించాలనుకుంటే పంపండి గానీ.. తన కుటుంబ సభ్యులను వేధించడం ఎందుకని ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడిన ఉద్ధవ్‌ ఠాక్రే.. కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా దుర్వినియోగం చేస్తోందంటూ దుయ్యబట్టారు.

‘అధికారంలోకి రావాలనుకుంటే రండి. అంతేగానీ, అధికారంలోకి వచ్చేందుకు ఇటువంటి దుర్మార్గపు పనులు చేయకండి. మా కుటుంబంతోపాటు ఇతర కుటుంబ సభ్యులను మాత్రం వేధించకండి. మీ కుటుంబ సభ్యులపై మేమెప్పుడూ ఆ విధంగా వ్యవహరించలేదు. మీరు అధికారంలోకి వచ్చేందుకు మమ్మల్ని జైల్లో పెట్టాలి అనుకుంటే.. ముందు నన్ను జైల్లో పెట్టండి’ అంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో భాజపా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర భాగస్వామ్య పక్షాల నేతలు, వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడాన్ని తప్పుబట్టారు.

గత కొంతకాలంగా మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ముమ్మర సోదాలు జరుపుతున్నాయి. ఇందులో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవలే అరెస్టు చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. అంతకుముందు ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కూడా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్ర మంత్రి, ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీశాఖ దాడులు కొనసాగించింది. అనంతరం సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ సోదరుడు శ్రీధర్‌ మధవ్‌ పటాంకర్‌పైనా ఈడీ సోదాలు జరిపింది. ఇలా తమ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలతోపాటు తన కుటుంబీకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయంటూ మహారాష్ట్ర సీఎం మండిపడ్డారు. కేవలం మహారాష్ట్రాలో అధికారంలోకి రావడానికే భాజపా ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని