Updated : 29 Jun 2022 22:29 IST

Maharashtra Crisis: సుప్రీం కోర్టులో ఉద్ధవ్‌కు షాక్‌.. రేపే బలపరీక్ష

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్ర రాజకీయాల్లో (Maharashtra Crisis) కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టులో ఉద్ధవ్‌ ఠాక్రేకు చుక్కెదురైంది. బలం నిరూపించుకోవాలంటూ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదేశించడంపై సర్వోన్నత న్యాయస్థానాన్ని శివసేన ఆశ్రయించగా.. వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. విశ్వాస పరీక్షపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గవర్నర్‌ ఆదేశాలను సమర్థించింది. దీంతో గురువారం ఉదయం 11గంటలకు ఉద్ధవ్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాఢీ ప్రభుత్వం బలం నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటుతో సంక్షోభంలో పడిన ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వం రేపు సాయంత్రం 5గంటల లోపు బలపరీక్ష ఎదుర్కోవాలని రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించారు. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ ఠాక్రే సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. దీంతో ఠాక్రే ప్రభుత్వ అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేబీ పార్దీవాలాలతో కూడిన బెంచ్‌ దాదాపు మూడున్నర గంటల పాటు విచారణ జరిపింది.

మహా సర్కారు తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. నిన్న రాత్రి ప్రతిపక్ష నేత ఫడణవీస్‌ గవర్నర్‌ను కలిశారని, ఈ భేటీ జరిగిన కొద్ది గంటలకే గవర్నర్‌ నుంచి బలపరీక్షపై ఆదేశాలు వచ్చాయని ఠాక్రే సర్కారు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఇద్దరు ఎన్సీపీ సభ్యులు కొవిడ్‌తో బాధపడుతున్నారని, మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నారని పేర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష నిర్వహించడం సరికాదని అభిప్రాయపడింది. అటు శిందే వర్గం తరఫున ఎన్‌కే కౌల్‌ తమ వాదనలు వినిపించారు. రేపు బలపరీక్ష జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం బలపరీక్ష నిర్వహించాలని తీర్పు వెలువరించింది.

Latest Updates..

 • బలపరీక్షకు ముందు సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు.
 • బలపరీక్ష నేపథ్యంలో భాజపా ఎమ్మెల్యేలు ముంబయి చేరుకుంటున్నారు.
 • ప్రస్తుతం జైల్లో ఉన్న ఎన్సీపీ నేతలు నవాబ్‌ మాలిక్‌, అనిల్‌ దేశ్‌ముఖ్‌ సైతం రేపటి బలపరీక్షలో పాల్గొననున్నారు. 
 • మహారాష్ట్రలో మొత్తం సభ్యుల సంఖ్య 288 కాగా.. ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు.
 • భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు.
 • తమ వర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్‌నాథ్‌ శిందే పేర్కొంటున్నారు.
 • బలపరీక్ష నేపథ్యంలో ముంబయిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

మహారాష్ట్రలో ఇవాళ్టి పరిణామాలు..

 1.  ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన బుధవారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా సోకడంతో ఈ భేటీకి డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌, ఛగన్‌ భుజ్‌బల్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఎప్పట్నుంచో శివసేన డిమాండ్‌గా ఉన్న ఔరంగాబాద్‌ పేరును శంభాజీనగర్‌గా; ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మారుస్తూ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నవీ ముంబయి విమానాశ్రయం పేరును డీబీ పాటిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చింది.
 2. గత కొంతకాలంగా అస్సాంలోని గువాహటి హోటల్‌లో బసచేసిన శిందే వర్గం ఈ సాయంత్రం అక్కడి నుంచి గోవాకు బయల్దేరింది. శిందే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా గువాహటి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానాల్లో బయల్దేరారు. ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌ శిందే మాట్లాడుతూ.. తామంతా రేపు ముంబయికి చేరుకుంటామన్నారు. బలపరీక్షలో పాల్గొని ఓటు వేస్తామన్నారు. ఆ తర్వాత లెజిస్లేచర్‌ పార్టీ సమావేశం నిర్వహించి తమ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.
 3. ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ఠాక్రేకు దేవేంద్ర ఫడణవీస్‌ ఫోన్‌ చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్‌ పార్టీ మద్దతు కోరారు. రేపు బలపరీక్ష సమయంలో మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా.. రాజ్‌ఠాక్రే అంగీకరించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎంఎన్‌ఎస్‌కు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.
 4. మహారాష్ట్రలోని నగరాల పేర్లు మారుస్తూ ఉద్ధవ్‌ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయంపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మండిపడ్డారు. మహా వసూల్‌ అఘాడీ ప్రభుత్వం ఔరంగాబాద్‌ పేరును శంభాజీనగర్‌గా మార్చడం చూసి నవ్వు ఆగడంలేదన్నారు. దాదాపు గత మూడేళ్లుగా సెక్యులర్‌ రాజకీయాల్లో మునిగిన ఉద్ధవ్‌ ఠాక్రే.. తన చివరి కేబినెట్‌ సమావేశంలో హిందుత్వను నిరూపించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు.
Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని