Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా.. గవర్నర్‌ ఆమోదం

మహారాష్ట్రలో బుధవారం కీలక పరిణమాలు చోటుచేసుకొంటున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. .....

Updated : 30 Jun 2022 00:19 IST

ముంబయి: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం (Maharashtra political crisis) కీలక మలుపు తిరుగుతున్నాయి. బల పరీక్ష ఎదుర్కోవడానికి ముందే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) తన పదవికి రాజీనామా చేశారు. దీంతో గవర్నర్‌ ఆయన రాజీనామాను ఆమోదించారు. శివసేన నుంచి ఏక్‌నాథ్‌ శిందే వర్గీయులు తిరుగుబాటుతో చోటుచేసుకున్న ఉత్కంఠ పరిణామాలతో మహా వికాస్‌ అఘాడీ సర్కార్‌ కూలిపోయింది. గురువారం బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నిమిషాల వ్యవధిలోనే తన రాజీనామాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రసంగించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. తనకు సహకరించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. బాలాసాహెబ్‌ ఆశయాలు నెరవేర్చామన్నారు. తమ ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందని.. ఆ దిష్టి ఎవరిదో అందరికీ తెలుసన్నారు. రెబల్‌ ఎమ్మెల్యేలు తమతో మాట్లాడాల్సిందని.. సొంత పార్టీ వాళ్లే తమను మోసం చేశారంటూ ఉద్ధవ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. 

‘‘సీఎం పదవికి రాజీనామా చేస్తున్నా.. శివసైనికుల రక్తం చిందడం నాకు ఇష్టంలేదు. నేను ఊహించని రీతిలో అధికారం చేపట్టాను.. అదే పద్ధతిన వెళ్తున్నా. నేను శాశ్వతంగా ఎక్కడికీ వెళ్లను.. ఇక్కడే ఉంటాను. మళ్లీ శివసేన భవన్‌లోనే కూర్చుంటా. నా ప్రజలతో సమావేశమవుతా. సీఎం పదవితో పాటు ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తున్నా. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. డెమోక్రసీని కచ్చితంగా అనుసరించాల్సిందే. అలాంటి వ్యక్తులు (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) పట్ల విశ్వాసం ఉంచడమే నేను చేసిన పెద్ద తప్పు’’ అని ఉద్ధవ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అనంతరం తన నివాసం మాతోశ్రీ నుంచి స్వయంగా కారునడుపుకుంటూ రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిసి రాజీనామ లేఖ అందించారు. దీంతో ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని ఉద్ధవ్‌ను గవర్నర్‌ కోరారు. 


మరోవైపు రాష్ట్ర రాజకీయ పరిణామాలపై భాజపా కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్పందించారు. నేడు అన్ని విషయాలు వెల్లడిస్తామని తెలిపారు.  నేడు ముంబయి రావద్దని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను భాజపా మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ కోరారు. ప్రమాణ స్వీకారం రోజే ముంబయి రావాలని  వారికి సూచించారు.  


  • మరోవైపు, తాజా పరిణామాలతో భాజపా నేతలు ముంబయిలోని తాజ్‌ ప్రెసిడెంట్‌ హోటల్‌లో సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకొని.. మాజీ సీఎం ఫడణవీస్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌, ఇతర నేతలు పాల్గొన్నారు.
  • ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా నేపథ్యంలో శిందే వర్గంతో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
  • మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 288 కాగా.. ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు.
  • భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు.
  • తమ వర్గానికి స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలుపుకొని మొత్తం 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన రెబల్‌ నేత ఏక్‌నాథ్‌ శిందే పేర్కొంటున్న విషయం తెలిసిందే. శిందే శిబిరంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండటంతో చివరకు ఉద్దవ్‌ రాజీనామా చేయక తప్పలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని