Maharashtra crisis: ఉద్ధవ్‌ ఠాక్రే రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు.. కానీ..!

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా విషయమై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Published : 27 Jun 2022 20:23 IST

ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) కొనసాగుతున్న వేళ శివసేన(Shiv Sena) అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా విషయమై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం పదవికి ఆయన రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ‘మహా’ కూటమిలోని ఓ సీనియర్‌ నేత చెప్పడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘‘శివసేన అధినేత ఒకసారి కాదు రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు. కానీ, ఓ సీనియర్‌ నేత చెప్పడంతో ఆయన రాజీనామా చేయకుండా ఆగిపోయారు’’ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తనకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) జూన్‌ 21(గత మంగళవారం)న గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజున సీఎం పదవికి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రకటించాలనుకున్నారని తెలిసింది. కానీ, మహా వికాస్‌ అఘాడీ కూటమికి చెందిన సీనియర్‌ నాయకుడు ఠాక్రేను రాజీనామా చేయకుండా ఒప్పించారని అధికార వర్గాల సమాచారం.

తర్వాత రోజున ఉద్ధవ్‌ ఠాక్రే మళ్లీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. ‘మహా’ కూటమిలోని ముఖ్య నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడించాలనుకున్నారట. అప్పుడు కూడా ఠాక్రే ఉద్దేశాన్ని గమనించిన ఆ సీనియర్‌ నేత రంగంలోకి దిగారట. ఆరోజు సైతం ఫేస్‌బుక్‌ ద్వారా సాయంత్రం 4గంటలకు రాజీనామా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫేస్‌బుక్‌ లైవ్‌ అరగంట ఆలస్యం అయ్యింది. దీనికి కారణం కూటమిలోని సీనియర్‌ నేత ఠాక్రేతో మాట్లాడి రాజీనామా ప్రకటించవద్దని ఆయనను ఒప్పించారని తెలిసింది. 

ఉద్ధవ్‌ ఠాక్రే ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేలు వచ్చి తను రాజీనామా చేయాలని కోరితే కచ్చితంగా చేస్తానన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైనా తన మీద ఫిర్యాదు చేస్తే సీఎం పదవి నుంచి  వైదొలుగుతానని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఉద్ధవ్‌ ఠాక్రే తన అధికార నివాసం ‘వర్ష’ను వీడి తన స్వగృహం ‘మాతోశ్రీ’కి వెళ్లిపోయారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని