Maharashtra crisis: ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు

శివసేనలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడే సూచనలు కనిపించడం లేదు.

Updated : 26 Jun 2022 13:47 IST

ముంబయి: శివసేనలోని ఓ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి ఇప్పుడప్పుడే తెరపడే సూచనలు కనిపించడం లేదు. గువాహటిలో మకాం వేసి న రెబెల్‌ ఎమ్మెల్యేలు మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే వారంతా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ అయి తదుపరి కార్యాచరణ ఏంటో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రోజుకి రూ.9లక్షల ఖర్చు.. ఆదిత్య ఠాక్రే

మరోవైపు శనివారం శివసేన జాతీయ కార్యవర్గం సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘శివసేనతో పోరాడే సత్తా గనక వారికి ఉంటే మేం పోటీకి సిద్ధం. ఇక ద్రోహులను గెలవనిచ్చే ప్రసక్తే లేదు. ఈ ఉదంతం తర్వాత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేసి మాట్లాడారు. గత కొన్ని రోజుల పరిణామాలను చూస్తుంటే మనల్ని వదిలివెళ్లిన వారు మన మంచికే వెళ్లినట్లు అనిపిస్తోంది. కొవిడ్‌-19 విజృంభణ సమయంలో అత్యంత సమర్థవంతంగా ఎవరు పనిచేశారో యావత్తు దేశం చూసింది. అలాంటి వ్యక్తి (సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేనుద్దేశించి) ఇప్పుడు అధికార నివాసాన్ని వదిలివెళ్లాల్సి వచ్చింది. బలవంతంగా తీసుకెళ్లిన ఎమ్మెల్యేల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్నారు. రోజుకి రూ.9 లక్షలు వెచ్చిస్తున్నారు. వారున్న అస్సాం రాష్ట్రంలోనే లక్షల మంది వరద బాధితులు ఉన్నారు. వారిని మాత్రం పట్టించుకోవడం లేదు. అధికార పార్టీని వీడిన ముఠాకు ప్రతిపక్ష పార్టీ మద్దతు పలకడం బహుశా ఇదే తొలిసారి’’ అని ఆదిత్య ఠాక్రే వ్యాఖ్యానించారు.

ఎంతకాలం దాక్కుంటారు?

మరోవైపు గువాహటిలో మకాం వేసిన అసమ్మతి ఎమ్మెల్యేలు ఇంకా ఎంతకాలం దాక్కుంటారని సేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ట్విటర్‌ వేదికగా ఆదివారం ప్రశ్నించారు. రెబెల్‌ ఎమ్మెల్యేల్లోని ఒకరి ఫొటోను రౌత్‌ తన సందేశానికి జత చేయడం గమనార్హం. ఇక తాజా పరిణామాలపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ మనుగడ అసెంబ్లీ వేదికగానే తేలుతుందని వ్యాఖ్యానించారు.

రాజీకి యత్నాలు..

ఇదిలా ఉండగానే.. అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. అసమ్మతి సభ్యుల భార్యలతో ఆమె చర్చలు జరుపుతున్నారు. వారి భర్తల్ని ఎలాగైనా రాజీ చేయాలని ఆమె కోరుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉద్ధవ్‌ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నట్లు సమాచారం.

గవర్నర్‌ డిశ్ఛార్జి!

ఇక ఈ ఎపిసోడ్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్న గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. ఇటీవల కొవిడ్‌ బారిన పడిన ఆయన పూర్తిగా కోలుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని