Uma Bharti: మధ్యప్రదేశ్‌లో చౌకగా మద్యం.. భాజపా సర్కారుపై ఉమా భారతి ఫైర్‌..!

మధ్యప్రదేశ్‌లో నూతన మద్యం విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం మరింత చౌకగా లభించనుంది. అయితే ఈ విధానంపై మధ్యప్రదేశ్‌

Updated : 02 Apr 2022 06:11 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో నూతన మద్యం విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో మద్యం మరింత చౌకగా లభించనుంది. అయితే ఈ విధానంపై మధ్యప్రదేశ్‌ భాజపా సర్కారుకు సొంత పార్టీ నాయకురాలి నుంచే విమర్శలు ఎదురయ్యాయి. సీఎం శివరాజ్‌ సింగ్‌ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత ఉమా భారతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ ఆదాయం సంపాదించడం సిగ్గుచేటని ట్విటర్‌ వేదికగా దుయ్యబట్టారు.

‘‘ఈ రోజు మధ్యప్రదేశ్‌లో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఈ కొత్త నిబంధనలతో రాష్ట్రంలో మరింత మందికి ఆల్కహాల్‌ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ నిబంధనలను రాష్ట్రంలోని మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో ఇలాంటి మద్య విధానాలపై రోడ్లెక్కి ఆందోళనలు చేస్తోన్న భాజపా పార్టీ.. మధ్యప్రదేశ్‌లో ఎందుకు మద్యం ధరలను తగ్గించింది..? ప్రజల గౌరవం, ప్రాణాలతో ఆడుకుంటూ మనం డబ్బు సంపాదిస్తున్నందుకు సిగ్గుగా ఉంది’’ అని ఉమా భారతి వరుస ట్వీట్లలో మండిపడ్డారు.

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించాలంటూ గళమెత్తిన ఉమా భారతి ఇటీవల ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఓ బండరాయితో లిక్కర్‌ దుకాణంలోకి నేరుగా వెళ్లిన ఆమె.. మద్యం బాటిళ్లను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉమాభారతి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా.. అది వైరల్‌గా మారింది.

ఇదిలా ఉండగా.. పొరుగు రాష్ట్రాల నుంచి లిక్కర్‌ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం మద్యం ధరలు మరింత తగ్గడమే గాక, విదేశీ మద్యం అమ్మకాలకూ అనుమతి లభించింది. ఇక విదేశీ మద్యంపై ఎక్సైజ్‌ సుంకాన్ని కూడా తగ్గించింది.  ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.కోటి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఇంట్లోనే బార్‌ను తెరుచుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిపై ఉమా భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని