మద్య నిషేధం.. నడ్డాకు ఉమాభారతి విజ్ఞప్తి

మద్య నిషేధంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి కీలక విజ్ఞప్తి చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యం నిషేధం విధించాలని .........

Updated : 22 Jan 2021 04:16 IST

వరుస ట్వీట్లు చేసిన కేంద్ర మాజీ మంత్రి

దిల్లీ: మద్య నిషేధంపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆ పార్టీ సీనియర్‌ నేత ఉమా భారతి కీలక విజ్ఞప్తి చేశారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో మద్యం నిషేధం విధించాలని ఆయన్ను కోరారు. ఈ మేరకు గురువారం ఆమె వరుస ట్వీట్లు చేశారు. మధ్యప్రదేశ్‌లో కొత్తగా మద్యం దుకాణాలను ప్రారంభిస్తామంటూ ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వెల్లడించిన వేళ ఆమె ట్వీట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భాజపా పాలిత రాష్ట్రాల్లో పూర్తిగా మద్యపాన నిషేధానికి మనం సిద్ధంగా ఉండాలని నడ్డాను కోరారు. అలాగే, మధ్యప్రదేశ్‌లో కొత్త మద్యం దుకాణాలకు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఇంకా అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆమె స్వాగతించారు.

కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో అన్ని రాష్ట్రాలూ మద్యం నిషేధం పాటించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో కరోనా, ఇతర అనారోగ్య కారణాలతో మరణాలు జరిగాయే తప్ప.. మద్యపానం వల్ల ఒక్క మరణం కూడా సంభవించలేదని పేర్కొన్నారు. యూపీ, మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన ఉదంతాలనూ ఉమాభారతి తన ట్వీట్లలో ప్రస్తావించారు. అధిక రోడ్డు ప్రమాదాలకు కారణం.. తాగి వాహనాలు నడపడమేనన్నారు. మద్యపాన నిషేధం అమలు బిహార్‌లో భాజపా విజయానికి దోహదం చేసిందని తెలిపారు. మహిళలు ఏకపక్షంగా నీతీశ్‌ కుమార్‌కే ఓట్లు వేశారని గుర్తుచేశారు. మద్యం ద్వారా సమకూరే ఆదాయాన్ని ఎక్కడి నుంచైనా రాబట్టుకోవచ్చన్న ఆమె.. మద్యం మత్తులో జరుగుతున్న భయంకరమైన దారుణాలు, హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు దేశానికి కళంకం తెస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని