ప్రత్యర్థి గుర్తుతో ప్రచారం.. కొంపముంచింది!

ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంటారు. ఇది సహజమే..

Published : 14 Feb 2021 01:29 IST

గుంటూరులో కంగుతిన్న అభ్యర్థులు

గుంటూరు: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అవలంబిస్తుంటారు. ఇది సహజమే.. కానీ బరిలోకి దిగిన అభ్యర్థులిద్దరూ ప్రత్యర్థి గుర్తులతో పోటాపోటీగా ప్రచారం చేస్తే..! ఆ గెలుపోటములకు బాధ్యత ఎవరిదో తేల్చడంలో అనేక సమస్యలు ఎదురవుతాయి. గుంటూరు జిల్లాలో ఇద్దరు అభ్యర్థులకు ఈ తరహా అనుభవమే ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే..

నరసరావుపేట నియోజకవర్గంలోని నర్సింగపాడు గ్రామ పంచాయతీ రెండో వార్డుకు వెంకటశివ, ఏడుకొండలు పోటీ చేశారు. వెంకటశివ గౌను గుర్తుతో, ఏడుకొండలు కుక్కర్‌ గుర్తుతో ప్రచారం చేశారు. తీరా పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత బ్యాలెట్‌ పేపర్లలో ఒకరి గుర్తులు వేరొకరికి ముద్రించి ఉండడం చూసి అభ్యర్థులు కంగుతిన్నారు. ఇదేంటంటూ ఇద్దరు అభ్యర్థులూ అధికారుల వద్దకు వెళ్లారు. అసలు ఏం జరిగిందని అధికారులు ఆరా తీశారు. ఎన్నికల సంఘం కేటాయించింది.. బ్యాలెట్‌ పేపర్లలో ముద్రించిన గుర్తులు ఒకటేనని ఎన్నికల అధికారులు స్పష్టం చేయడంతో అభ్యర్థులకు తత్వం బోధపడింది. అభ్యర్థులే సరిగా చూసుకోకుండా ప్రత్యర్థి గుర్తులతో ప్రచారం చేసుకున్నట్లు అధికారులు తేల్చారు.

అసలు విషయం తెలిసిన తర్వాత అభ్యర్థులు బిక్కముఖం వేశారు. పోలింగ్‌ వాయిదా వేయాలని కోరారు. దానికి అధికారులు అంగీకరించలేదు. చివరికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చే వారికి అసలు గుర్తులు చెప్పాలని తమ మద్దతుదారులను పురమాయించారు. ఆ విధంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. చివరికి విజయం మాత్రం వెంకటశివను వరించింది. 14 ఓట్ల ఆధిక్యంతో ప్రత్యర్థి ఏడుకొండలుపై ఆయన గెలుపొందారు. తారుమారు గుర్తులతో చేసిన ప్రచారం ఎన్నికల ఫలితంపై ప్రభావం చూపించిందని ఓడిన అభ్యర్థి ఏడకొండలు వాపోయారు.

ఇవీ చదవండి..

ఏపీ పంచాయతీ: ముగిసిన రెండో దశ పోలింగ్‌

దాంపత్య జీవితానికి అడ్డు వస్తోందని...!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని