AP News: సింపథీ పని చేయదు.. అందుకోసం ఆయన ఏడ్చేశారంటే నమ్మను: ఉండవల్లి

ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై  వైకాపా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా తాను భావించడంలేదన్నారు....

Published : 28 Nov 2021 01:24 IST

రాజమహేంద్రవరం: ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కుటుంబంపై  వైకాపా మంత్రులు చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్పందించారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా తాను భావించడంలేదన్నారు. అయితే ఆయన అంతగా స్పందించాల్సిన అవసరమూ లేదని అభిప్రాయపడ్డారు. మంత్రుల మాటలు పూర్తి అవాస్తవమని రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు కేవలం సానుభూతి కోసమే అలా చేశారని అందరూ భావిస్తున్నారు. కానీ గతంలో ఆయనపై బాంబు దాడి జరిగి శరీరమంతా రక్తసిక్తం అయినప్పుడు సైతం సింపథీ పని చేయలేదన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. ఎన్టీఆర్‌ కూడా చంద్రబాబును తీవ్రంగా విమర్శించి.. తాను బతికి ఉండటానికి కారణం లక్ష్మీ పార్వతి అని చెప్పినా.. అక్కడా సానుభూతి పనిచేయలేదు. కేవలం రాజీవ్‌ గాంధీ చనిపోయినప్పుడే ఎన్నికల్లో సింపథీ కొంతమేర పని చేసింది. ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ చనిపోయినప్పుడూ సానుభూతి పనిచేయలేదు’’ అని తెలిపారు.

వారిపై నేను ఎలాంటి వదంతులూ వినలేదు!

‘‘ఏ సందర్భం లేకుండా ఎవరైనా మాట్లాడుతున్నారంటే.. అందుకు వారి మానసిక సమస్యలు కారణమై ఉండొచ్చు. అలాంటివారి గురించి ఇంతగా ఆలోచించడం వ్యర్థం. చంద్రబాబును ఓ మంత్రి ఏ విధంగా దుర్భాషలాడతాడో అందరికీ తెలుసు. ఉన్నతమైన సభలో గౌరవంగా మాట్లాడితేనే.. అందరూ వారికి తిరిగి అదే గౌరవం ఇస్తారు. 1972 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎన్టీఆర్‌ కుమార్తెలపై ఎలాంటి వదంతులనూ నేను ఇప్పటివరకు వినలేదు. సెలబ్రిటీలకు సంబంధించి లేనిపోని ప్రచారాలు సర్వసాధారణమే. వారి కుటుంబంలో పురంధేశ్వరి, హరికృష్ణతో పరిచయం ఉంది. వారు చాలా గౌరవంగా మాట్లాడతారు‘’ అని ఉండవల్లి వివరించారు. 

Read latest Political News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని