రేపు సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ సర్కారు సిద్ధమైంది. రేపు సాయంత్రం కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసినట్లు సమాచారం.  సోనోవాల్‌, జ్యోతిరాదిత్య సింధియా

Updated : 06 Jul 2021 20:43 IST

యువత, మహిళలకు పెద్దపీట

దిల్లీ: కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది. తొలుత 8న మంత్రివర్గం విస్తరిస్తారని వార్తలు వచ్చినప్పటికీ అది మరింత ముందుకొచ్చింది. బుధవారం సాయంత్రం 6 గంటలకు మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. కేంద్రంలో ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌కు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కనున్నట్లు తెలిసింది. ఈసారి యువతకు, వెనుకబడిన వర్గాల వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యావంతులు, మహిళలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. మొత్తం మంత్రి వర్గంలో 24 మంది మహిళలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రులకు పని భారం తగ్గించడం సహా, పనితీరు బాగోలేని వారికి ఉద్వాసన పలికే అవకాశముంది.

మంత్రివర్గ విస్తరణపై ప్రధాని నరేంద్రమోదీ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, భాజపా సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి బీఎస్‌ సంతోష్‌తో ఇటీవల పలుమార్లు చర్చించారు. కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 52 మంది ఉండగా.. కొత్తగా మరో 20 నుంచి 25 మందికి చోటు దక్కవచ్చని తెలిసింది. కేబినెట్‌లో ఉండి మరణించిన రామ్‌ విలాస్‌ పాసవాన్‌, సురేశ్‌ అంగడి, రాజీనామా చేసిన అకాళీదళ్‌ నాయకురాలు హర్‌ సిమ్రత్‌ కౌర్‌, శివసేన ఎంపీ అర్వింద్‌ సావంత్‌ స్థానాలను భర్తీ చేయడం సహా.. ఒకటి కంటే ఎక్కువ శాఖలు చూస్తున్న మంత్రులకు పని భారం తగ్గించనున్నట్లు సమాచారం. మంత్రి వర్గంలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు, ఒక మాజీ ఉపముఖ్యమంత్రికి చోటు కల్పించే  సూచనలున్నాయి. అసోం సీఎం పదవిని త్యాగంచేసిన సర్బానంద సోనోవాల్‌, మహారాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి నారాయణ్‌ రాణె, ఇటీవల ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తీరత్‌ సింగ్‌ రావత్‌ కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చని తెలిసింది. 

బిహార్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌ సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలకు మంత్రివర్గంలో సముచిత స్థానం దక్కనుంది. మధ్యప్రదేశ్‌ నుంచి జోతిరాధిత్య సింధియా, రాకేశ్‌ సింగ్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. బిహార్‌ నుంచి ఎల్జేపీ నేత పశుపతి కుమార్‌ పరాస్‌, యూపీ నుంచి అప్నాదళ్‌ నాయకురాలు అనుప్రియ పటేల్‌, భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణకు కూడా చోటుదక్కనున్నట్లు తెలుస్తోంది.

మహారాష్ట్ర నుంచి పూనం మహాజన్‌, ప్రీతం ముండే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆర్టికల్‌ 370 తొలగింపు సమయంలో పార్లమెంటులో ప్రసంగంతో ఆకట్టుకున్న లద్దాఖ్‌ ఎంపీ జమ్యాంగ్‌ సింగ్‌ పేరు కూడా వినిపిస్తోంది. మొత్తంగా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి మూడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, పశ్చిమ్‌బెంగాల్, బిహార్‌, అసోంకు రెండు చొప్పున, రాజస్థాన్‌, జమ్ముకశ్మీర్‌, ఒడిశా, లద్దాఖ్‌లకు ఒక్కో మంత్రి పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఇటీవల కేంద్ర మంత్రుల పనితీరుపై పలుమార్లు సమీక్ష జరిపిన ప్రధాని పనితీరు బాగోలేనివారిని తొలగించనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని