Nitin Gadkari : ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది : గడ్కరీ

తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్‌ ప్రధానమని ఆయన వివరించారు.

Updated : 29 Apr 2022 17:59 IST

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రగతిశీల సంపన్న రాజ్యమని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. ప్రగతి సాధించాలంటే నీరు, కరెంటు, రహదారులు, కమ్యూనికేషన్స్‌ ప్రధానమని ఆయన వివరించారు. శంషాబాద్‌లో హైవేల విస్తరణ పనులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

‘తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాలకు జాతీయ రహదారుల అనుసంధానం జరిగింది. హైదరాబాద్‌ రీజనల్ రింగ్ రోడ్డు డీపీఆర్ పూర్తయ్యింది. ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ఇంకా మిగిలే ఉంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డుకు శంకుస్థాపన చేయటానికి మూడు నెలల్లో వస్తా. తెలంగాణ అభివృద్ధి చెందితే .. భారతదేశం అభివృద్ధి సాధించినట్లే. రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నా. నేషనల్ హైవేల వెంట లాజిస్టిక్స్ పార్కులు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కన్పిస్తున్నాయి..

తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు కన్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కోరిన వెంటనే కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య తీరింది. భారతదేశ అభివృద్ధిలో హైదరాబాద్ కీలకంగా ఉంది. అమెరికా రోడ్లతో సమానంగా తెలంగాణ హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. విజయవాడ, హైదరాబాద్ హైవే సమస్యను ఎంపీ కోమటిరెడ్డి ప్రస్తావించారు. 
జాతీయ రహదారుల అభివృద్ధితోనే పరిశ్రమలు, వ్యవసాయం అభివృద్ధి చెందుతాయి.

తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు..

2014 నుంచి తెలంగాణలో 4,996 కి.మీ  మేర జాతీయ రహదారులు నిర్మించాం. తెలంగాణలో 32 జిల్లాలను జాతీయ రహదారులతో లింక్ చేయటం సంతోషంగా ఉంది. దేశవ్యాప్తంగా 26కు గాను.. తెలంగాణలో ఐదు గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 3లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఐదు వేల కోట్లతో హైదరాబాద్ విశాఖపట్నం హైవే, ‌ నాగపూర్ విజయవాడ హైవే కోసం 12వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం’ అని గడ్కరీ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని