TS NEWS: కేసీఆర్‌తో మాట్లాడిన కేంద్రమంత్రి

నీటి ప్రాజెక్టుల విషయంలో తెలగురాష్ట్రాల నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రంగంలోకి దిగారు

Updated : 25 Jun 2021 19:32 IST

హైదరాబాద్‌: నీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగురాష్ట్రాల నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతున్న తరుణంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ రంగంలోకి దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో షెకావత్‌ ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఎన్జీటీ ఆదేశాలపై చర్చించినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎలాంటి ఆమోదం లేకుండా ఎన్జీటీ ఆదేశాలను ఉల్లంఘించి రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడుతోందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలిసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి కృష్ణా బోర్డు బృందాన్ని పంపిస్తామని, పనులు జరుగుతున్నాయో? లేదో? కమిటీ పరిశీలిస్తుందని షెకావత్‌ చెప్పినట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయడానికి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పలు మార్లు విజ్ఞప్తి చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌.జి.టి) నిర్ణయానికి విరుద్ధంగా పనులు కొనసాగిస్తోందంటూ ఫొటోలను కూడా జత చేసింది. ఎన్‌.జి.టి ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు విఫలమైందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ మంగళవారం కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ సీఎస్‌ను హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దంటూ గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారంటూ తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.

ఏపీ వాదన ఇలా...

జలవివాదంపై అవసరమైతే సీఎం కేసీఆర్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కృష్ణా జలాలపై భావోద్వేగాలు రెచ్చగొట్టే ఉద్దేశం ఏపీ ప్రభుత్వానికి లేదని.. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు రాష్ట్రాలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మంత్రి పేర్ని నాని తెలిపారు. రాజకీయాల కోసమే తెలంగాణ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సహా పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్‌ విధానమన్నారు. జలాల వినియోగంపై సీఎం కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. కృష్ణా నది నుంచి గ్లాసు నీరు కూడా అదనంగా తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.

రాయలసీమకు నీరిచ్చేందుకు కృషి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో చెప్పారని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్‌ స్వయంగా సీఎం జగన్‌తోనే ఈ మాటలన్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ చెప్పిన మాటలకు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. రాయలసీమకు తాగు, సాగు నీరందించేలా చూడాలని కేసీఆరే సూచించారని పేర్కొన్నారు. ఏపీకి రావాల్సిన నీటి వాటాను మాత్రమే వాడుకుంటున్నామని పెద్దిరెడ్డి వివరించారు. ఎక్కువ నీరు వాడుకోవాలని జగన్‌ ప్రభుత్వం ఆలోచించడంలేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని