Kishan Reddy: భాజపాపై కేసీఆర్‌, కేటీఆర్‌ విష ప్రచారం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని కేంద్రమంత్రి, భాజపా నేత కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated : 13 May 2022 15:53 IST

తుక్కుగూడ: కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తెరాస నేతలు ప్రయత్నం చేస్తున్నారని భాజపా సీనియర్‌ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా తెరాస ప్రభుత్వ పాలన ఉందని ఎద్దేవా చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరుకానున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఏర్పాట్లను కిషన్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కుటుంబ పాలన చేస్తూ మొత్తం తన గుప్పిట ఉండాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని.. కానీ తెలంగాణ సమాజం చీదరించుకుంటోందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు తెరాసపై ఎంత వ్యతిరేకంగా ఉన్నారో తెలిసిందని చెప్పారు. 

ప్రజల్ని ఎవరూ ఎక్కువ రోజులు మోసం చేయలేరు

భాజపాపై తండ్రీ కొడుకులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ విషం కక్కుతూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా తమకే ఉందంటూ కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారన్నారు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారని.. వారిని ఎవరూ ఎక్కువ రోజులు మోసం చేయలేరని వ్యాఖ్యానించారు. భాజపా చేపట్టిన కార్యక్రమాలతో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించామని చెప్పారు. తుక్కుగూడ సభలో రాష్ట్రంలోని ప్రజావ్యతిరేక, అవినీతి, నియంతృత్వ పాలనపై అమిత్‌షా ప్రసంగిస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భాజపా జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

మేం మీలా కాదు.. మాది దేశవ్యాప్తంగా ఒకటే పాలసీ

తెలంగాణలో ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని త్వరగా ఎఫ్‌సీఐకి అందించాలని సూచించారు. రైతులకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ‘‘మేం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకే పాలసీని అమలు చేస్తాం. మీలా గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లకు ఒకలా..  ఇతర నియోజకవర్గాలకు మరోలా వ్యవహరించం’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలు అంశాన్ని ఉద్దేశించి కిషన్‌రెడ్డి ఈ విధంగా అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని