kishan reddy: తెలంగాణ గడ్డపై భాజపా పాగా ఖాయం

శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకుని.. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు.

Published : 21 Jun 2024 06:35 IST

ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. 88 స్థానాల్లో గెలుపు
‘సెల్యూట్‌ తెలంగాణ’లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా
కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం.. సత్కారం

ర్యాలీలో అభివాదం చేస్తున్న లక్ష్మణ్, సంజయ్, కిషన్‌రెడ్డి. చిత్రంలో పాల్వాయి హరీశ్‌బాబు, రాకేశ్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, 

వెంకటరమణారెడ్డి, ఏవీఎన్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఈటల రాజేందర్, గోడం నగేష్, పాయల్‌ శంకర్‌ తదితరులు

ఈనాడు - హైదరాబాద్, న్యూస్‌టుడే - బేగంపేట, గన్‌ఫౌండ్రి: శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 మంది శాసనసభ్యులను గెలిపించుకుని.. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘సెల్యూట్‌ తెలంగాణ’ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వాన్ని తీసుకువచ్చేందుకు అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకుని, ఊరూరా అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. భాజపా నుంచి లోక్‌సభకు పోటీ చేసిన 17 మంది అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, భాజపా కార్యకర్తల పక్షాన తెలంగాణ ప్రజలకు వందనాలు తెలియచేస్తున్నట్లు కిషన్‌రెడ్డి అన్నారు. ఎనిమిది మంది ఎంపీల తరఫున కార్యకర్తలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో భాజపా 36 శాతం ఓట్లను సొంతం చేసుకుందని,  కార్యకర్తలు చేసిన శ్రమతో ప్రజలు ఆశీర్వదించి ఓటేశారని అన్నారు. కేంద్రమంత్రులుగా నియమితులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ‘సెల్యూట్‌ తెలంగాణ’ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో కలిసి సంఘీభావం తెలుపుతున్న ధన్‌పాల్‌ సూర్యనారాయణ, అర్వింద్, లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల, రఘునందన్‌రావు,   కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేశ్, రాకేశ్‌రెడ్డి, పాల్వాయి హరీశ్‌బాబు, వెంకటరమణారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి 

వారిని బేగంపేట విమానాశ్రయం నుంచి ర్యాలీగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తోడ్కొని వచ్చారు. వారిద్దరినీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, దళితమోర్చా నేతలు, గిరిజన మోర్చా, యువ మోర్చా, మహిళా మోర్చా నేతలు ఘనంగా సత్కరించారు. తర్వాత కేంద్ర మంత్రులు.. తమ సహచర ఎంపీలను సన్మానించారు. ర్యాలీ, సత్కార కార్యక్రమాల్లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీలు డి.కె.అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, గోడం నగేష్, ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, పి.హరీశ్‌బాబు, రామారావు పాటిల్, పాయల్‌ శంకర్, ఎమ్మెల్సీ ఎవీఎన్‌ రెడ్డి, పార్టీ నాయకులు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, నగరానికి చెందిన భాజపా కార్పొరేటర్లు, కిషన్‌రెడ్డి భార్య కావ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించారు.


గోల్డెన్‌ టెంపుల్‌గా భాగ్యలక్ష్మి ఆలయం

-సంజయ్‌

సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసేవరకు పోరాడుతామని ప్రకటించారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని ‘గోల్డెన్‌ టెంపుల్‌’గా మారుస్తామన్నారు. కార్యకర్తల కష్టార్జితం, భాగ్యలక్ష్మి అమ్మవారి దయతోనే భాజపా రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. కార్యకర్తలతోపాటు భాజపాపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ సెల్యూట్‌ అని అన్నారు. 


త్యాగాల పునాదులపై భాజపా

-లక్ష్మణ్‌

త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ భాజపా అని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఎనిమిది మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కిషన్‌రెడ్డి, సంజయ్‌ కేంద్ర మంత్రులుగా నియమితులు కావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. భాజపా కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. అనేక మంది కార్యకర్తల త్యాగాల ఫలితమే నేటి విజయమన్నారు. 


మూడు గంటలకు పైగా ఘనంగా ర్యాలీ

కేంద్ర మంత్రులకు స్వాగతం పలికే సందర్భంగా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు బేగంపేట విమానాశ్రయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు మూడు గంటలకు పైగా ర్యాలీని నిర్వహించారు. కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ర్యాలీ సాగింది. వారంతా కళాబృందాలు, డప్పులతో సందడి చేశారు. సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కిషన్‌రెడ్డి తదితర నాయకులు.. ర్యాలీగా బయల్దేరి రాత్రి తొమ్మిది గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు కిషన్‌రెడ్డి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు వచ్చారు.  రెండు రోజుల కిందటే నగరానికి చేరుకున్న బండి సంజయ్, ఈటల రాజేందర్‌ తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అంతా కలిసి ప్రత్యేక రథంపై బేగంపేట, ప్యారడైజ్‌ మీదుగా ర్యాలీ కొనసాగించారు. సుమారు రెండు వేల మంది కార్యకర్తలు విమానాశ్రయంలో పాటలు, నృత్యాలు, నినాదాలతో ర్యాలీని అనుసరించారు. దారి పొడవునా కార్యకర్తలు, ప్రజలకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని