Rammohan naidu: దేశమంతా చంద్రబాబు వైపు చూస్తోంది: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

ఎన్డీయేలో కీలకంగా ఉన్న చంద్రబాబు వైపే దేశం మొత్తం చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

Updated : 18 Jun 2024 07:08 IST

రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి

ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం: ఎన్డీయేలో కీలకంగా ఉన్న చంద్రబాబు వైపే దేశం మొత్తం చూస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలో అన్ని విమానాశ్రయాలనూ అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో ఉండేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. అన్ని శాఖల నుంచీ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని అధినేత చంద్రబాబు తనకు సూచించినట్లు వెల్లడించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి శ్రీకాకుళం జిల్లాకు సోమవారం ఆయన తొలిసారి వచ్చారు. శ్రీకాకుళంలోని ఎన్టీఆర్‌ మైదానంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆధ్వర్యంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ‘కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రధాని మోదీ పిలిపించి కీలకమైన విమానయాన శాఖను నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తాం. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన కుటుంబం పడిన బాధ కళ్లారా చూశా. దేవుడు ఆయనకు న్యాయం చేయడానికే అఖండ విజయాన్ని ఇచ్చాడు’ అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రెండు ఇంజిన్ల సర్కారు ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని