Rammohan Naidu: ఈ బరువును బాధ్యతగా భావిస్తా

యుక్త వయసులో కేంద్రమంత్రి పదవి భారమే అయినప్పటికీ బాధ్యతగా భావిస్తానని శ్రీకాకుళం తెదేపా ఎంపీ, పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు.

Updated : 12 Jun 2024 06:48 IST

చంద్రబాబు వేగాన్ని అందుకొనేలా పని చేస్తా
యుద్ధ ప్రాతిపదికన భోగాపురం పనులు
మోదీ కూడా రాష్ట్రానికి ఏదైనా చేయాలన్న కుతూహలంతో ఉన్నారు
తెలంగాణ సమస్యలూ పరిష్కరిస్తా 
ఈనాడు-ఈటీవీ ఇంటర్వ్యూలో పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు

ఈనాడు, దిల్లీ: యుక్త వయసులో కేంద్రమంత్రి పదవి భారమే అయినప్పటికీ బాధ్యతగా భావిస్తానని శ్రీకాకుళం తెదేపా ఎంపీ, పౌర విమానయాన శాఖ మంత్రిగా నియమితులైన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చడానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. శాఖల కేటాయింపులో ఎలాంటి అసంతృప్తీ లేదని.. తనకు కేటాయించిన శాఖతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రబాబు ఇప్పటికే తన కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఉంటారని.. దాని ప్రకారమే దిల్లీ వెళ్లి పని చేస్తానని అన్నారు. వివిధ అంశాలపై ‘ఈనాడు-ఈటీవీ’తో రామ్మోహన్‌ నాయుడు ప్రత్యేకంగా మాట్లాడారు. 

ప్రజలు ఆ మాటలు గుర్తుపెట్టుకున్నారు..

‘కేంద్ర మంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా ప్రజల కల ఇది. ఎంపీగా గెలిపిస్తాం, కేంద్రమంత్రిగా రావాలని ఎన్నికలకు ముందు ఆశీర్వదించారు. పైనుంచి మానాన్న ఎర్రన్నాయుడు ఆశీర్వదించారు. చంద్రబాబు, లోకేశ్‌ నన్ను కుటుంబ సభ్యుడిగా భావించి ప్రోత్సహించారు. పవన్‌ కల్యాణ్, మోదీ సహకారం, బాబాయ్‌ అచ్చెన్నాయుడి కృషి, కుటుంబ సభ్యుల కష్టం, జిల్లా ప్రజల దీవెనలు తోడుగా నిలిచాయి. నాకు అప్పగించిన పౌర విమానయాన శాఖ ద్వారా రాష్ట్రంలో ఉపాధి, మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడంతో పాటు, మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకొని రాష్ట్రానికి కావాల్సిన పనులన్నీ చేయడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తా. ప్రణాళికలు రూపొందించి అమలు చేయడంలో చంద్రబాబుకు సాటి లేరు. ఆయన మార్గదర్శనంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా సేవ చేసి నాదైన ముద్రను చూపుతా. ప్రధాని మోదీ కూడా ఆంధ్రాకు ఏదైనా చేయాలన్న కుతూహలంతో ఉన్నారు. ప్రజలకు ఆ నమ్మకం కలిగించడానికే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వస్తున్నారు. గత పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు సమయం దొరకలేదు. అందుకే ముగ్గురు ఎంపీలున్న మాకు మాట్లాడటానికి సమయం ఇవ్వండి, రేపు మేం సంఖ్యా బలం పెంచుకొని వస్తామని చెప్పా. పార్లమెంటులో చెప్పిన ఆ మాటను గుర్తుపెట్టుకుని ఈసారి మంచి బలంతో తెదేపా కూటమిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగానే తెదేపా నుంచి 16, ఎన్డీయే నుంచి 21 మంది ఎంపీలను గెలిపించారు.

కేంద్రంతో పొరపొచ్చాలు లేవు

శాఖల కేటాయింపులో మాకు ఎలాంటి అసంతృప్తీ లేదు. ఏ విషయంలోనూ కేంద్రంతో మాకు పొరపొచ్చాలు లేవు. ప్రధాని మోదీ కేటాయించిన శాఖలతో రాష్ట్రానికి ప్రయోజనం కల్పించడానికి చాలా అవకాశాలున్నాయి. ప్రభుత్వ సహకారం తీసుకొని మిగిలిన అన్ని మంత్రిత్వశాఖల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చడమే మా ముందున్న కర్తవ్యం. జగన్‌ విధ్వంసాన్ని సరిదిద్దాలంటే 30 మంత్రిత్వ శాఖలూ మనకు అవసరమే. అలాగని అన్నీ మనం తీసుకోలేం కదా! ఏ శాఖ ఇచ్చినా మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకోవాలి. ఇది వరకు ఎంపీగా నేను మంత్రుల అపాయింట్‌మెంట్లు తీసుకొని వారికి సమస్యలు విన్నవించి, పరిష్కారం చేసేవాడిని. వారే ఇప్పుడు సహచరులుగా ఉన్నారు. వారందరికీ నా మీద అభిమానం ఉంది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని మంత్రిత్వ శాఖలూ మన దగ్గరే ఉన్నాయా అనేట్లు ఫలితాలు తీసుకొస్తాను.

కిషన్‌రెడ్డి అలా అనడం సంతోషాన్నిచ్చింది..

తెలంగాణలో కొత్త ఎయిర్‌పోర్టుల కోసం రామ్మోహన్‌నాయుడి సహకారం తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనడం సంతోషం కలిగించింది. రెండు రాష్ట్రాల మధ్య ఆ అనుబంధం కొనసాగాలి. ఈ మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణ ప్రజలకు చేరువయ్యే అవకాశం దక్కింది. ఆ రాష్ట్రంపైనా దృష్టి పెడతాను. సహచర మంత్రులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఏం ప్రతిపాదన వచ్చినా ప్రాధాన్యం ఇస్తా. ఆ రాష్ట్రానికీ న్యాయం చేయడానికి కచ్చితంగా పనిచేస్తా. ఇన్నాళ్లూ ఎంపీగా ఉండి మంత్రులను ప్రశ్నించిన నేను.. ఇప్పుడు మంత్రిగా ఉండి ఎంపీలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ప్రయాణానికీ ఒక మొదలు ఉంటుంది. ఇప్పుడు కేంద్రమంత్రిగా కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నా. తెలుగు ప్రజలతో పాటు, దేశ ప్రజలకు సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చిందనుకుంటున్నా’ అని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.


మోదీ విజన్‌కు అనుగుణంగానే శాఖ కేటాయింపు 

పౌర విమానయాన శాఖ అన్నది చాలా శక్తిమంతమైన మంత్రిత్వ శాఖ. శాఖలు ప్రకటించిన తర్వాత మంత్రులందరూ ఈ శాఖ ఎవరికి వచ్చిందని ఆరా తీశారు. యువకుడైన నాకు అప్పగించారని తెలిసి మెచ్చుకున్నారు. ప్రధాని మోదీ మంచి విజన్‌ పెట్టుకొని ఉంటారు.. అందుకే దీన్ని యువకుడికి ఇచ్చారని వ్యాఖ్యానించారు. సామాన్యుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చేదిగా విమానయాన శాఖ రూపాంతరం చెందింది. ప్రపంచంతో భారతదేశం అనుసంధానం కావడానికి ఈ శాఖ చాలా అవసరం. సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకురావడం, చిన్న చిన్న నగరాలను అనుసంధానించడానికి కృషి చేయాల్సి ఉంది. అంతర్జాతీయ పరిస్థితులతో ముడిపడిన శాఖ కాబట్టి ఇంకా దీనిపై పట్టు సాధించాలి. అధికారులతో సమీక్ష నిర్వహించి, ఒక విజన్, ప్లానింగ్‌తో పనిచేస్తా. ఈ మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చాలా చేయొచ్చు. ఉద్యోగాలు, మౌలికవసతుల కల్పనకు చాలా అవకాశం ఉంది.


చంద్రబాబు ఓ హ్యూమన్‌ ఎన్‌సైక్లోపీడియా

నాకు ఏ మంత్రిత్వ శాఖ వచ్చినా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని ముందే అనుకున్నాను. విమానయానశాఖ వచ్చినట్లు తెలిసిన తర్వాత రాష్ట్రంలో పౌర విమానయానానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు నడిపించాలనుకున్నా. మా గురువు అశోక్‌ గజపతిరాజు గతంలో ఈ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఈ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులన్నీ ఇచ్చి ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేశారు. ప్రభుత్వం మారడం వల్ల అది పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన రికార్డు సమయంలో పూర్తి చేసి దానిని ఉత్తరాంధ్రకు ప్రధాన హబ్‌గా తీర్చిదిద్దుతాం. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కర్నూలు, కడప ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేస్తాం. చంద్రబాబు ఓ హ్యూమన్‌ ఎన్‌సైక్లోపీడియా. నాకు పౌరవిమానయానశాఖ దక్కిన వెంటనే దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆయన ముందే కొన్ని ప్రణాళికలు వేసుకొని ఉంటారు. రాష్ట్రాభివృద్ధికి ఈ శాఖను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న నాకు ఆయన ప్రణాళికలు ఇచ్చి దిల్లీకి పంపుతారు. వాటిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని