UP Polls: యూపీ ‘కమలం’లో కాక.. 3 రోజుల్లో ముగ్గురు మంత్రుల ఔట్‌..!

ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీసీ వర్గంలో బలమైన నేతలుగా ఉన్న మంత్రులు..

Published : 13 Jan 2022 17:16 IST

పార్టీని వీడిన ఎనిమిది మంది నేతలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీసీ వర్గంలో బలమైన నేతలుగా ఉన్న మంత్రులు.. ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేయడం కమలం పార్టీలో కాక పుట్టిస్తోంది. ఇప్పటికే సీనియర్‌ నేతలు స్వామి ప్రసాద్‌ మౌర్య, దరా సింగ్ చౌహన్‌ తమ మంత్రి పదవులకు రాజీనామా చేయగా.. తాజాగా మరో మంత్రి ధరమ్‌ సింగ్‌ సైనీ కూడా యూపీ మంత్రివర్గం నుంచి తప్పుకొన్నారు.

రాజీనామా చేసిన కొద్ది సేపటికే ధరమ్‌ సింగ్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను కలిశారు. ఈ ఫొటోను అఖిలేష్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ ధరమ్‌ సింగ్‌కు స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. దీంతో ఈయన కూడా త్వరలోనే ఎస్పీలో చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. సహరణ్‌పుర్‌లో బలమైన బీసీ నాయకుడైన ధరమ్‌ సింగ్‌.. నకుద్‌ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

స్వామి ప్రసాద్‌ మౌర్యకు ధరమ్‌ సింగ్‌ అత్యంత సన్నిహితుడు. నిజానికి ధరమ్‌ సింగ్‌ కూడా పార్టీని వీడనున్నారని వార్తలు వస్తున్నప్పటికీ వాటిని ఆయన కొట్టిపారేశారు. నిన్నటికి నిన్న తాను భాజపాలోనే ఉంటానని చెప్పిన ఆయన.. 24 గంటలు గడవకముందే మంత్రిపదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. స్వామి ప్రసాద్‌ మౌర్య రాజీనామా తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. ధరమ్‌ సింగ్‌కు ఫోన్‌ చేసి పార్టీలోనే కొనసాగాలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇతర బీసీ నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో తాను కూడా పార్టీ వీడాలని భావిస్తున్నట్లు సమాచారం.

గత మూడు రోజుల్లో యూపీ భాజపాలో ముగ్గురు మంత్రులతో పాటు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు బ్రిజేషన్‌ ప్రజాపతి, రోషన్‌ లాల్ వర్మ, భగవతి సాగర్‌, ముకేశ్‌ వర్మ, వినయ్ షాక్యా ఇప్పటికే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. త్వరలోనే వీరంతా సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

రోజుకు ఇద్దరు గుడ్‌బై..!

రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు భాజపాను వీడే అవకాశముందని సుహ్లదేవ్‌ భారతీయ సమాజ్‌పార్టీ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ అన్నారు. రోజుకు కనీసం ఇద్దరు చొప్పున జనవరి 20 నాటికి 18 మంది మంత్రులు పార్టీకి గుడ్‌బై చెబుతారని అంచనా వేశారు. అటు స్వామి ప్రసాద్‌ మౌర్య కూడా నిన్న ఇదే విషయాన్ని చెప్పారు. తన రాజీనామా భాజపాలో తుపాను రేకెత్తించిందని వ్యాఖ్యానించిన ఆయన.. రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు కాషాయ పార్టీని వీడుతారని అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా పరిగణించే యూపీ ఎన్నికలు.. ఇప్పుడు యావత్‌ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. భాజపా, సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని