UP Polls: 100 స్థానాల్లో పోటీ చేస్తాం: AIMIM

యూపీ ఎన్నికల్లో దాదాపు 100స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఎంఐఎం వెల్లడించింది

Published : 27 Jun 2021 22:27 IST

దిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించింది.

2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ ప్రారంభించిందన్నారు. ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ సారథ్యంలోని సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (SBSP)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల బరిలో దిగనుందని చెప్పారు. భగీదరి సంకల్ప్‌ మోర్చా పేరుతో ఇతర పార్టీలతో ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్‌ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అయితే, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదన్నారు.

ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ సారథ్యంలో ఏర్పడిన భగీదరి సంకల్ప్‌ మోర్చాలో ఇప్పటికే ఎనిమిది రాజకీయ పార్టీలున్నాయి. ముఖ్యంగా కృష్ణ పటేల్‌ అప్నాదళ్‌, జన్‌ అధికార్‌ పార్టీ, చంద్రశేఖర్‌ రావన్‌ నేతృత్వంలోని ఆజాద్‌ సమాజ్‌ వంటి పార్టీలు కూటమిలో ఉన్నాయి. మరోవైపు గతేడాది జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలుపొందింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్‌ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి సఫలమయ్యింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్‌, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు