
‘ఉగ్రవాదం అనే మొక్కను నాటింది కాంగ్రెస్సే’.. యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార భాజపా, కాంగ్రెస్ ఒకదానిపై మరొకటి విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదానికి బీజం నాటింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. లఖ్‌నవూలో నిర్వహించిన ఓ సమావేశంలో యోగి మాట్లాడుతూ.. ఉగ్రవాదం అనే మొక్క నాటింది కాంగ్రెస్సేనని, ఆ ఉగ్రవాదాన్ని భాజపా వేర్ల సహాతో పెకిలించిందని పేర్కొన్నారు. ‘జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి 1952లోనే కాంగ్రెస్ దేశంలో ఉగ్రవాదం అనే మొక్క నాటింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భాజపా.. ఉగ్రవాదాన్ని కూకటివేర్లతో సహా పెకిలించి వేసింది’ అని పేర్కొన్నారు.
యూపీలోని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీపైనా ఆదిత్యనాథ్ మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ హయాంలో ‘గుండా రాజ్’కు తావులేదని, అల్లర్లను ప్రేరేపించేందుకు ఎవరూ సాహసించలేరని పేర్కొన్నారు. ‘సమాజ్‌వాదీ ప్రభుత్వంలో ఉగ్రవాదులపై కేసులు కొట్టివేశారు. వాళ్లను కీర్తించారు. హిందువులపై కేసులు నమోదయ్యాయి. కానీ రాష్ట్రంలో భాజపా అధికారంలో ఉంటే అల్లర్లను ప్రేరేపించేందుకు ఎవరూ ధైర్యం చేయలేరు. పేదల ఆస్తిని కాజేసేందుకు మాఫియా సాహసించదు. అలా చేయాలని చూస్తే ప్రభుత్వ బుల్డోజర్ వారి ఛాతీపై పరుగులు తీస్తుంది’ అంటూ యోగి ఘాటుగా వ్యాఖ్యానించారు.