UP Elections: రాష్ట్రంలో అల్లర్లు తగ్గాయ్‌.. పెట్టుబడులు పెరిగాయ్‌: యూపీ సీఎం

భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో మత కలహాలు, ఉగ్ర దాడులు చోటుచేసుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో

Published : 04 Feb 2022 02:02 IST

లఖ్‌నవూ: భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో మత కలహాలు, ఉగ్ర దాడులు చోటుచేసుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ వెల్లడించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం వివరించారు.

‘‘యూపీలో బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ అధికారంలో(2007-2012) ఉన్నప్పుడు 364 అల్లర్లు చోటుచేసుకున్నాయి. సమాజ్‌వాది పార్టీ హయాంలో(2012-2017)లో 700 ఘర్షణలు జరిగాయి. వీటిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వచ్చిన మా ప్రభుత్వంలో ఎలాంటి కలహాలు, దాడులు జరగలేదు. గత ప్రభుత్వ పాలనలో కంటే మా పాలనలో నేరాల సంఖ్య భారీగా తగ్గింది. దారి దోపీడీలు 58శాతం, దోపీడీలు 64శాతం, హత్యలు 23శాతం, అపహరణలు 53శాతం, వరకట్నం హత్యలు 8శాతం, అత్యాచారాలు 43శాతం తగ్గాయి’’అని సీఎం చెప్పుకొచ్చారు. 

‘‘అంతేకాదు, యాంటీ-కన్వర్షన్‌ చట్టం తీసుకొచ్చాం. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేసే అల్లరి మూకల నుంచే పరిహారం రాబట్టేలా ఉత్తరప్రదేశ్‌ రికవరీ ఆఫ్‌ డ్యామేజ్‌ టు పబ్లిక్‌ అండ్‌ ప్రైవేటు ప్రాపర్టీ చట్టాన్ని అమలు చేస్తున్నాం. పోలీసు శాఖలో అనేక సంస్కరణలు చేపట్టాం. ఈ శాఖలో మహిళల నియామకాలు గతంలో కంటే మూడు రెట్లు పెరిగాయి. మా ప్రభుత్వంలో 155 మంది కరుడుగట్టిన నేరస్థులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. 3,638 మంది నేరగాళ్లు గాయపడ్డారు. మొత్తంగా 48,038 మందిని గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద అరెస్ట్‌ చేసి జైళ్లో పెట్టాం. 694 మందిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేశాం. నేరస్థులతో జరిగిన ఘర్షణల్లో 13 మంది పోలీసులు మరణించగా.. 1,236 మంది గాయపడ్డారు. రూ.2,046వేల కోట్ల అక్రమ ఆస్తుల్ని జప్తు చేశాం’’అని సీఎం వెల్లడించారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.5లక్షల ఉద్యోగాలకు నియమకాలు చేపట్టామని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. తమ ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షిస్తున్న తీరుతో రాష్ట్రానికి ఉన్న ఇమేజ్‌ మారిపోయిందని, ఫలితంగా పెట్టుబడులకు యూపీ గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.4. 68లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు జరిగాయని, రూ. 3లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులు ప్రారంభయ్యాయని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వివరించారు. 

రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న జరుగుతాయి. పూర్తి ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి. కాగా.. ఈ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి అధికారంలోకి రావాలని భాజపాతోపాటు, సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాది పార్టీ పట్టుదలతో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని