Published : 28 Mar 2022 16:11 IST

UP Politics: యోగి-అఖిలేశ్‌.. నవ్వుతూ, కరచాలనం చేసుకుంటూ..!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో అరుదైన ఘట్టం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా, సమాజ్‌వాదీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగిన సంగతి తెలిసిందే. అధికారం కాపాడుకోవాలని ఒకరు.. మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా చేసుకున్న విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కించారు. చివరకు ఫలితాల్లో గెలుపు ఓటమిలు తేలిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తాజాగా అసెంబ్లీలో అడుగుపెట్టిన ఇరువురు అగ్రనేతల మధ్య అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, ప్రతిపక్ష నేత ఆఖిలేశ్‌ యాదవ్‌లు కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ పలుకరించుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఇరువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాల్లో విజయం సాధించిన సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు, ప్రత్యర్థి సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ కూడా తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఇరువురు అగ్ర నేతలు కరచాలనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాకుండా ఆ సమయంలో అఖిలేశ్‌ యాదవ్‌ భుజంపై తడిమిన సీఎం యోగి.. నవ్వుకుంటూ ముందుకు వెళ్లిపోవడం విశేషం.

ఇదిలాఉంటే, యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‌ క్రితం పర్యాయం శాసనమండలి నుంచి ప్రాతినిధ్యం వహించారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. గోరఖ్‌పుర్‌ స్థానం నుంచి గెలుపొంది మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ కూడా కర్హాల్‌ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. దీంతో లోక్‌సభ సభ్యత్యానికి రాజీనామా చేసిన ఆయన.. అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలుగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇరు నేతలు ఆప్యాయంగా పలుకరించుకున్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts