UP Polls: నాలుగో విడతకు సిద్ధమైన యూపీ.. కీలకంగా లఖింపుర్‌ ఖేరీ

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

Published : 22 Feb 2022 23:26 IST

59 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్‌

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు నాలుగో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగనుండగా.. మొత్తం 624 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పిలిభిత్‌, లఖింపుర్‌ ఖేరీ, సీతాపుర్‌, హర్దోయ్‌, ఉన్నావ్‌, లఖ్‌నవూ, రాయ్‌బరేలీ, బందా, ఫతేపుర్‌ జిల్లాల్లో నాలుగో విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఇటీవల లఖింపుర్‌లో సంచలనం సృష్టించిన రైతులపై కారు దాడి ఘటన ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.

59 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో (2017)లో 51 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. నాలుగు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ, మూడుచోట్ల బహుజన్‌ సమాజ్‌ పార్టీ గెలుచుకోగా అప్నాదళ్‌ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా ఈసారి మాత్రం వివిధ పార్టీ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. లఖ్‌నవూ కంటోన్మెంట్ నుంచి భాజపా అభ్యర్థిగా న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్‌ పాఠక్‌ పోటీలో ఉన్నారు. అంతకుముందు ఆయన లఖ్‌నవూ సెంట్రల్‌ నుంచి గెలుపొందారు. లఖ్‌నవూ తూర్పు స్థానం నుంచి మరో మంత్రి అశుతోష్‌ టాండన్‌ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనురాగ్‌ భదౌరియా నిల్చున్నారు.

లఖ్‌నవూ జిల్లా సరోజినీ నగర్‌ స్థానం నుంచి భాజపా తరపున ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మాజీ అధికారి రాజేశ్వర్‌ సింగ్‌ రంగంలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎస్‌పీకి చెందిన మాజీ మంత్రి అభిషేక్‌ మిశ్రా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ నితిన్‌ అగర్వాల్‌ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ కూడా ఇదే విడతలో పోలింగ్‌ జరుగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన అదితి సింగ్‌ ఇటీవలే భాజపాలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె రాయ్‌బరేలీ స్థానం నుంచే భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 23వ తేదీ ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ మొదలై సాయంత్రం 6వరకు కొనసాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని