Published : 09 Feb 2022 17:35 IST

UP Polls 2022: యూపీ ఎన్నికల పోరుకు వేళాయే.. రేపే తొలి విడత పోలింగ్‌!

ఇంటర్నెట్ డెస్క్‌: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల సమరానికి వేళైంది. దేశ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రేపటి తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. కొవిడ్‌ నిబంధనలతో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ఏడు విడతల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు అధికార భాజపా సర్వశక్తుల్ని ఒడ్డుతుండగా.. కాషాయ దళాన్ని ఓడించడమే లక్ష్యంగా సమాజ్‌వాదీ పార్టీ-ఆర్‌ఎల్డీ కూటమి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ దిశగా అధికార, విపక్షాలు నువ్వా నేనా అన్నట్టుగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించి విమర్శలు, ప్రతివిమర్శలతో యూపీ రాజకీయాలను హీటెక్కించాయి. దీనికితోడు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కూడా అఖిలేశ్‌ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించడం విశేషం.

తొలి విడత పోలింగ్ విశేషాలివే..

  1. తొలి విడతలో భాగంగా పశ్చిమ యూపీలో 11 జిల్లాల పరిధిలోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ నియోజకవర్గాల పరిధిలో మంగళవారం సాయంత్రమే ఎన్నికల ప్రచారం ముగిసింది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై.. సాయంత్రం 6గంటల వరకు కొనసాగనుంది. 
  2. తొలి విడత ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రోడ్‌షోలు, భౌతిక ర్యాలీలకు అనుమతి నిరాకరించడంతో ప్రచారం ఎక్కువ భాగం వర్చువల్‌గానే జరిగింది. అధికార భాజపా తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, యోగి ఆదిత్యనాథ్‌ సహా పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. సమాజ్‌వాదీ పార్టీ- రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కలయికను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. యూపీలో వేగవంతమైన అభివృద్ధి కోసం డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యతకను గుర్తు చేస్తూ తమను మరోసారి గెలిపించాలని ప్రజల్నికోరారు.   
  3. సమాజ్‌వాదీ పార్టీ -ఆర్‌ఎల్‌డీ కూటమి ప్రధానంగా రైతు సమస్యలపైనే కేంద్రీకరించింది. దీంతో పాటు యోగి ఆదిత్యనాథ్‌ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేసింది.
  4. బీఎస్పీ చీఫ్‌ మాయావతి ఆలస్యంగా ఎన్నికల క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. అయితే, గతంలో తమ ప్రభుత్వ హయాంలో శాంతిభద్రతల ట్రాక్‌ రికార్డును ఆమె ప్రజలకు గుర్తుచేశారు. ఇకపోతే ప్రియాంకా గాంధీ సారథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇంటింటి ప్రచారాలతో ఆసక్తిని రేకెత్తించింది.
  5. జాట్‌ల ప్రభావం అధికంగా ఉన్న పశ్చిమ యూపీ ప్రాంతంలోనే  తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో కొనసాగిన సుదీర్ఘ ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన రైతులే క్రియాశీల పాత్ర పోషించడం గమనార్హం. 
  6. ఎన్నికలు జరిగే 11 జిల్లాలివే..: షామ్లి, హాపూర్‌, గౌతమ్‌బుద్ధనగర్‌, ముజఫర్‌నగర్‌, మేరఠ్‌, బాగ్‌పత్‌, ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌, అలీగఢ్‌, మథుర, ఆగ్రా
  7. తొలి విడతలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2.27కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  ఈ ఎన్నికల్లో మంత్రులు శ్రీకాంత్‌ శర్మ, సురేష్‌ రాణా, సందీప్‌ సింగ్‌, కపిల్‌ దేవ్‌ అగర్వాల్‌, అతుల్‌ గార్గ్‌, చౌధురి లక్ష్మీ నారాయణ్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 
  8. 2017 ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి భాజపా 53 స్థానాలు గెలుచుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు చెరో రెండు స్థానాలు, ఆర్‌ఎల్‌డీ ఒక స్థానం చొప్పున గెలుచుకున్నాయి. 
  9. ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని గౌతమ్‌బుద్ధనగర్‌ కలెక్టర్‌ సుహాస్‌ ఎల్‌. యతిరాజ్‌ విజ్ఞప్తి చేశారు. ఈ జిల్లా పరిధిలో నోయిడా, దాద్రి, జెవార్‌ నియోజకవర్గాలు ఉండగా..  గత ఎన్నికల్లో ఇక్కడ తక్కువ శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను ఆయన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
  10. ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఓటర్‌ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, సర్వీస్‌ గుర్తింపు కార్డు, బ్యాంకు/పోస్ట్‌ఆఫీస్‌ జారీ చేసిన పాస్‌బుక్‌, పాన్‌ కార్డు, స్మార్ట్‌ కార్డు, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, ఆరోగ్య బీమా స్మార్ట్‌ కార్డు, పెన్షన్‌ దస్త్రం, ఎంపీ/ఎమ్మెల్యే/ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, ఆధార్‌ కార్డులలో ఏదైనా తీసుకురావొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది.
Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని