Karnataka: ఇవే నా చివరి ఎన్నికలు.. సిద్ధరామయ్య సంచలన నిర్ణయం!

ఇవే తనకు చివరి ఎన్నికలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధ రామయ్య అన్నారు. అలాగని తాను రాజకీయాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించబోనన్నారు.

Published : 06 Feb 2023 01:21 IST

బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య(siddaramaiah) సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ఏడాదిలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివన్న ఆయన.. రాజకీయాల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టంచేశారు. మొత్తం 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంలో హెచ్‌డీ కుమార స్వామి సీఎంగా ఉండగా.. ఆ తర్వాత ఈ కూటమిలో ఏర్పడిన విభేదాల కారణంగా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత యడియూరప్ప సారథ్యంలో భాజపా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగా.. ఆ తర్వాత ఆయన స్థానంలో నూతన సీఎంగా బసవరాజ్‌ బొమ్మైను భాజపా అధిష్ఠానం నియమించిన విషయం తెలిసిందే.

మరోవైపు, కర్ణాటక సీఎం బొమ్మై, ప్రతిపక్ష నేత సిద్ధ రామయ్య మధ్య మాటల వార్‌ నడుస్తోంది. గత బడ్జెట్‌లో ప్రకటించిన పనుల్లో కేవలం 10శాతం మాత్రమే అమలు చేశారని.. రాష్ట్ర అప్పులు రూ.3లక్షల కోట్ల మార్కును దాటేసిందని సిద్ధరామయ్య ఆరోపించగా.. దీనిపై సీఎం బొమ్మై దీటుగా స్పందించారు. గతంలో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. కర్ణాటక చరిత్రలోనే ఆయన గరిష్ఠంగా అప్పులు చేశారంటూ విరుచుకుపడ్డారు. అయినా.. బడ్జెట్‌ అమలుకు సంబంధించిన వివరాలను వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అందజేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని