JDU - RJD: జేడీయూ - ఆర్జేడీ మతలబేంటో తెలియాల్సిందే!

జేడీయూకి సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆర్జేడీతో ఒప్పందం వెనకున్న మతలబేంటో చెప్పాలని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా నిలదీశారు.

Published : 28 Jan 2023 01:23 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో జేడీయూ - ఆర్జేడీ (JDU - RJD) కూటమిపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ రెండు పార్టీల కలయిక వెనుక మతలబేంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆర్జేడీతో పొత్తుపై జేడీయూ కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహా (Upendra Kushwaha) విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌ మాట ప్రకారం పార్టీ వీడనని చెబుతూనే.. పార్టీలో ఏం జరుగుతోందో అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అన్నారు.

‘‘పార్టీ వీడి, మళ్లీ తిరిగి వస్తున్నాననని నన్ను ముఖ్యమంత్రి మాటమాటకీ అంటున్నారు. ఆయన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే పార్టీ నుంచి బయటకి వెళ్లి తిరిగొచ్చాను. అదీ ఆయన బతిమాలితేనే వచ్చాను. 2009లో వెనక్కి రావాలని నీతీశ్‌ నన్ను ఓ బహిరంగ సభ వేదికగా కోరారు. మళ్లీ బయటకి వెళ్లిన తర్వాత.. 2021లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తిరిగి రావాలని ఆయనే ఆహ్వానించారు. అలా రెండుసార్లు పార్టీలోకి వచ్చాను తప్ప.. నా అంతట నేనుగా పార్టీలో చేరతానని ఎప్పుడూ అడగలేదు’’ అని ఉపేంద్ర కుష్వాహా అన్నారు.

ప్రస్తుతం నీతీశ్‌ తన వయసులో సగం వయసు ఉన్న వ్యక్తిని ప్రమోట్‌ చేయాలనుకుంటున్నారంటూ పరోక్షంగా తేజశ్వీ యాదవ్‌ను ఉద్దేశించి కుష్వాహా వ్యాఖ్యానించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నా... అధిష్ఠానం పట్టించుకోవడం లేదని ఉపేంద్ర ఆరోపించారు. పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి చాలా అంశాలున్నాయన్న ఆయన... ఓ వైపు పార్టీ బలహీన పడుతుంటే ఆర్జేడీతో ఒప్పందం కుదుర్చుకొని అనందపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. పార్టీలోని అంశాలపై కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరముందన్నారు.

నీతీశ్‌ కుమార్‌ రాష్ట్ర పగ్గాలను తేజశ్వీ యాదవ్‌కు అప్పగించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు కుష్వాహా అభిప్రాయపడ్డారు. పార్టీ వ్యవహారంపై చర్చించేందుకు డిసెంబరులో నితీశ్‌ను కలిశానని, అయితే ఆయన తన వాదన వినకుండానే ‘మళ్లీ పార్టీ మారే ఆలోచన ఏమైనా ఉందా?’ అని అడిగారని కుష్వాహా చెప్పుకొచ్చారు. భాజపాతో చేతులు కలుపుతారా? అని కూడా ప్రశ్నించారని అన్నారు. పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై నా ఆలోచనలను చెబుదాం అనుకుంటే... ఆయన నన్నే అవమానపరిచేలా మాట్లాడారని కుష్వాహా తన ఆవేదనను వ్యక్తం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు