
UP Cabinet Expansion: యూపీ మంత్రివర్గంలోకి జితిన్ ప్రసాద
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీని వీడి భాజపాలో చేరిన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో చోటు లభించింది. మరో ఆరుగురిని సహాయ మంత్రులుగా యూపీ సర్కారు నియమించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ విస్తరణపై చేపట్టింది. అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించింది. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆధ్వర్యంలో జితిన్ ప్రసాద మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. పల్తూరామ్, ఛత్రపాల్ గంగ్వార్, సంగీత బింద్, ధరమ్‌వీర్ ప్రజాపతి, సంజీవ్ కుమార్, దినేశ్ ఖతిక్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.
2017లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఇప్పటివరకు మూడుసార్లు కేబినెట్‌ను విస్తరించారు. 2019 ఆగస్టు 21న మంత్రివర్గ విస్తరణ చేపట్టి కేబినెట్‌లోకి 23 మంది కొత్త మంత్రులను ఆహ్వానించారు. మరికొద్ది నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కేంద్రంతోపాటు రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీ సాధించిన (325 సీట్లు) భాజపా.. ఈసారి 350 స్థానాల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మధ్యే జరిగిన పశ్చిమ బెంగాల్‌లో మెరుగైన ఫలితాలే సాధించింది. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికలను కీలకంగా భావిస్తున్న భాజపా.. అన్ని వర్గాల వారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను మొదలుపెట్టినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.