Uttarakhand: అక్కడ అంతే.. ఉత్తరాఖండ్‌లో సీఎంలకు ‘లక్‌’ లేదు..!

దేవ్‌భూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి అదే ట్రెండ్‌ రిపీట్‌ అయ్యింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌

Published : 10 Mar 2022 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేవ్‌భూమి ఉత్తరాఖండ్‌లో మరోసారి అదే ట్రెండ్‌ రిపీట్‌ అయ్యింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించినప్పటికీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ దామిని మాత్రం ‘బ్యాడ్‌లక్‌’ సెంటిమెంట్ వెంటాడింది. ఈ ఎన్నికల్లో ఖటిమా నుంచి పోటీ చేసిన ధామి కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 21 ఏళ్ల ఈ రాష్ట్ర చరిత్రలో సిట్టింగ్‌ ముఖ్యమంత్రులెవరూ తదుపరి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. ఒక్క ఉప ఎన్నికల్లో మినహా ప్రతిసారీ సీఎంలకు ఓటమి తప్పలేదు. ఒకసారి సిట్టింగ్‌ సీఎం పోటీ చేయలేదు.

ఉత్తర్‌ప్రదేశ్ నుంచి విడిపోయి 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పడింది. 2002లో తొలిసారిగా ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఎన్‌డీ తివారీ సీఎంగా బాధ్యతలు చేపట్టలేదు. 2007లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీ తివారీ పోటీ చేయలేదు. ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రులతో కలిసి భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బి.సి ఖండూరీ సీఎంగా ఎన్నికయ్యారు. 

హరీశ్‌ రావత్‌ రెండు చోట్ల పోటీ చేసినా..

ఆ తర్వాత 2012లో జరిగిన ఎన్నికల్లో బి.సి ఖండూరీ కొద్వార్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైర విషయం ఏంటంటే.. భాజపా 31, కాంగ్రెస్‌ 32 చోట్ల విజయం సాధించింది. కేవలం ఒక్క సీటు తేడాతో భాజపా ఓడిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. హరీశ్ రావత్‌ సీఎం అయ్యారు. ఇక, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్‌.. హరిద్వార్‌ రూరల్‌, కిచ్చా రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ ఆయనను విజయం వరించలేదు. పోటీ చేసిన రెండు చోట్లా హరీశ్ ఓటమి చవిచూశారు. 

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి.. ఖటిమా నియోజకవర్గం నుంచి పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో దాదాపు 7వేల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో భాజపా మాత్రం వరుసగా రెండో సారి విజయం సాధించి కొత్త ట్రెండ్‌ సృష్టించింది. 

ఒక్క భగత్‌ సింగ్‌ కోశ్యారీ మాత్రమే సిట్టింగ్‌ సీఎంగా విజయం సాధించినప్పటికీ ఆయన పార్టీ గెలుపొందకపోవడంతో మరోసారి సీఎం అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. 2001-02 మధ్య కాలంలో కోశ్యారీ సీఎంగా ఉన్నారు. 2002 ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 

మాజీ సీఎంల పరిస్థితి అదే..

సిట్టింగ్‌ సీఎంలదే కాదు.. మాజీ సీఎంలకూ అదృష్టం వరించట్లేదు. రాష్ట్ర తొలి సీఎం అయిన నిత్యానంద స్వామి 2002లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. తాజా ఎన్నికల్లో హరీశ్ రావత్‌ లాల్‌కౌన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని