Uttarakhand: ఉత్తరాఖండ్‌ సీఎంకు పదవీ గండం?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ పదవి సంకట స్థితిలో పడింది. ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండగా.. దానిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సొంత పార్టీ నుంచే....

Updated : 02 Jul 2021 13:02 IST

దిల్లీ: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ పదవి సంకట స్థితిలో పడింది. ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండగా.. దానిపై సందేహాలు నెలకొన్నాయి. మరోవైపు రాష్ట్రంలో సొంత పార్టీ నుంచే ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా ఆయన దిల్లీలోనే మకాం వేశారు. దీంతో సీఎం పదవి నుంచి ఆయనను తొలగిస్తారనే ఊహాగానాలు దిల్లీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి.

ఉప ఎన్నికపై నీలినీడలు...

భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సొంతపార్టీ నేతల అసమ్మతి సెగతో త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని వీడగా.. ఆ స్థానంలో ఎంపీ తీరత్‌ సింగ్‌ రావత్‌ మార్చి 10న రాష్ట్ర పగ్గాలు చేపట్టారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఆయన ఆరు నెలల్లో రాష్ట్ర శాసనసభ లేదా మండలికి ఎన్నిక కావాలి. కానీ, ఉత్తరాఖండ్‌లో మండలి లేదు. దీంతో తీరత్‌ సింగ్‌ సెప్టెంబరు 10లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.

మరోవైపు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధన 151ఏ ప్రకారం.. ఖాళీ అయిన స్థానానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఎన్నికైన అభ్యర్థికి కనీసం ఏడాది పాటు పదవీకాలం ఉంటేనే ఎన్నికలు నిర్వహించాలని నిబంధన సూచిస్తోంది. అయితే, 2017లో కొలువుదీరిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ కాలం 2022, మార్చి 23తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికైన అభ్యర్థి సేవలందించేందుకు ఏడాది సమయం లేనందున ఉపఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. మరోవైపు సెప్టెంబరు 10తో సీఎంకు ఉన్న ఆరు నెలల కాలం కూడా ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం రానుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.

మరోవైపు కొవిడ్‌ విజృంభిస్తున్నప్పటికీ మార్చి-ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించి అప్రతిష్ఠ మూటగట్టుకున్న ఎన్నికల సంఘం ఇప్పట్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రావత్ పదవిపై నీలినీడలు కమ్ముకొన్నాయి.

పార్టీలో అసంతృప్తి..

గతంలో త్రివేంద్ర సింగ్‌ రావత్ వలె తీరత్‌ సింగ్‌ సైతం సొంతపార్టీ నుంచి అసమ్మతి ఎదుర్కొంటున్నారు. తీరత్‌ స్థానంలో సీఎం కుర్చీలో తమని కూర్చోబెట్టాలని ఇప్పటికే సీనియర్‌ నేతలు సత్‌పాల్‌ మహరాజ్‌, ధన్‌సింగ్‌ రావత్‌ పార్టీ అధిష్ఠానానికి సంకేతాలు పంపారు. మరోవైపు సీఎం హోదాలో తీరత్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు పలుసార్లు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనపై రాష్ట్రంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని పార్టీ నాయకులు ఆధిష్ఠానానికి చెప్పినట్లు సమాచారం. ఆయన కంటే ముందు పదవిలో ఉన్న త్రివేంద్ర సింగ్‌ నిర్ణయాలను తప్పుబట్టి సొంత పార్టీనే తీరత్‌ సింగ్‌ ఓ దశలో ఇరకాటంలోకి నెట్టారు.

భాజపా ముందున్న మార్గాలు..

ప్రభుత్వ పదవీకాలం ఏడాదికంటే తక్కువ ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అభ్యర్థి కోసం ఎన్నికలు నిర్వహించిన సందర్భాలు గతంలో ఉన్నట్లు ప్రముఖ న్యాయ నిపుణుడు ఎస్.కె.మెండిరట్ట తెలిపారు. గతంలో ఒడిశా సీఎం గిరిధర్ గమాంగ్‌ అలాగే ఎన్నికయ్యారని పేర్కొన్నారు. లేదా రావత్‌తో రాజీనామా చేయించి.. తిరిగి ఒకరోజు తర్వాత మళ్లీ సీఎం బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఇలా జరిగిన సందర్భాలూ గతంలో ఉన్నాయి. అయితే, ఈ సంప్రదాయంపై గతంలో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ రెండూ కాకపోతే రావత్‌ స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని నియమించాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని