MP Vote value: రాష్ట్రపతి ఎన్నికల్లో తగ్గనున్న ఎంపీల ఓటు విలువ... కారణమిదే!

 presidential elections: ఈ ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల ఓటు విలువ తగ్గనుంది. ప్రస్తుతం 708గా ఉన్న ఒక్కో ఎంపీ ఓటు విలువ 700కు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ ఈ సారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం.

Published : 09 May 2022 02:04 IST

దిల్లీ: ఈ ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్‌ సభ్యుల ఓటు విలువ తగ్గనుంది. ప్రస్తుతం 708గా ఉన్న ఒక్కో ఎంపీ ఓటు విలువ 700కు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌ ఈ సారి ఎన్నికల్లో పాల్గొనకపోవడమే ఇందుకు కారణం. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే ఎంపీల ఓటు విలువను రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలకు ఎన్నికైన శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అంతకుముందు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో 83 సీట్లు ఉండేవి. జమ్మూకశ్మీర్‌ పునర్‌ విభజన చట్టం ప్రకారం.. జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఉంటుంది. లద్దాఖ్‌ను కేంద్రమే నేరుగా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ద్వారా పాలిస్తుంది. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ఇటీవలే డీలిమిటేషన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ వెలువరించింది. 90 సీట్లు ఉండబోతున్నాయని పేర్కొంది. అయితే, ఎన్నిక పూర్తయ్యి సభ కొలువుదీరడానికి ఇంకా సమయం పట్టేట్లు ఉంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24తో ముగియనుండడంతో ఆలోపే రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇదే తొలిసారి కాదు..

1974లో గుజరాత్‌ అసెంబ్లీ రద్దయ్యింది. దీంతో ఆ ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలెవరూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. అలాగే, ఎంపీల ఓటు విలువ సైతం పలుమార్లు మారుతూ వచ్చింది. 1952లో ఒక్కో ఎంపీ ఓటు విలువ 494 కాగా.. 1957లో 496కి పెరిగింది. ఆ తర్వాత 493 (1962), 576 (1967, 1969), 723 (1974)గా ఉంది. 1977 నుంచి 1992 వరకు ఎంపీల ఓటు విలువ 702గా నిర్ణయించారు. ప్రస్తుతం 708గా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ కారణంగా 700కి తగ్గే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజార్టీ అధికార ఎన్డీయేకు సొంతంగా లేదు. కూటమికి ఇంకా కావాల్సిన ఓట్ల సంఖ్య తక్కువే. ఒకవేళ విపక్షాలు ఏకమైతే ఎన్డీయేకు కష్టమే. దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు