Vangalapudi Anitha: నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు.. నేడు ప్రొటోకాల్‌తో లోపలికి..

‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్‌కానిస్టేబుల్‌కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్‌తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా.

Updated : 15 Jun 2024 14:10 IST

చంద్రబాబు ఆశీర్వాదంతోనే అది సాధ్యమైంది: హోంమంత్రి అనిత

ఈనాడు, అమరావతి: ‘‘మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలకు కూడా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్‌కానిస్టేబుల్‌కు ఇచ్చి వెళ్లిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రొటోకాల్‌తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. చంద్రబాబు ఆశీర్వాదంతో ఇప్పుడు అదే జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అవమానించిన చోట.. నన్ను అధికారిక మర్యాదలతో తీసుకెళ్లే రోజు వచ్చింది’’ అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హోంమంత్రిగా నియమితులైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగిన పోలీసులు.. తీరు మార్చుకోకపోతే వారినే మార్చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నేరాల రేటు తగ్గిస్తామని, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలనే ఆలోచన చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామని వివరించారు. ‘‘వైకాపా ప్రభుత్వ అక్రమాలు, అరాచకాలపై పోరాడుతున్నందుకు సామాజిక మాధ్యమాల్లో అత్యంత హేయమైన భాషలో నాపై ట్రోలింగ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టారు. వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అన్నందుకు తోట చంద్రయ్యను హత్య చేశారు. అలాంటి వారందరికీ శిక్షలు పడేలా చేస్తాం. మహిళలపై జరిగిన అఘాయిత్యాల్లో నిందితులకు శిక్ష పడేలా చేస్తాం. పోలీసులకు ఉన్న బకాయిలను చెల్లిస్తాం’’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని