Andhra News: విశాఖ కార్యనిర్వాహక రాజధాని కావడం ఖాయం.. ప్రతిపక్షాలది వితండవాదం: మంత్రి బొత్స

విశాఖపట్నంలో భూములు దోపిడీకి గురవుతున్నాయని, అందుకే ఇక్కడ పరిపాలనా రాజధాని వద్దంటూ కొంతమంది వ్యక్తులతోపాటు ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

Updated : 22 Oct 2022 08:38 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో భూములు దోపిడీకి గురవుతున్నాయని, అందుకే ఇక్కడ పరిపాలనా రాజధాని వద్దంటూ కొంతమంది వ్యక్తులతోపాటు ప్రతిపక్షాలు వితండవాదం చేస్తున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. భూకబ్జాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని, దాని కోసం రాజధాని వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో.. అనకాపల్లిలో శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు, విప్‌ కరణం ధర్మశ్రీ, జేఏసీ ఛైర్మన్‌ హనుమంతు లజపతిరాయ్‌ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి బొత్స మాట్లాడుతూ దేశంలో 500 వెనుకబడిన జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ ఉన్నాయంటే ఈ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేలా, ఇక్కడి వారిని రెచ్చగొట్టేలా అమరావతి పాదయాత్ర సాగుతోందన్నారు. పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో ప్రవేశించగానే ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛందంగా దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూసేసి శాంతియుతంగా నిరసన తెలపాలని కోరారు. విశాఖ పరిపాలనా రాజధాని కావడం ఖాయమని, దీనివల్ల ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. దీన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత తెదేపా నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. పాలనా వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమని పాదయాత్ర చేస్తున్నప్పుడే జగన్‌ చెప్పారన్నారు. అమరావతిని అభివృద్ధి చేయాలంటే రూ.లక్షల కోట్లు కావాలని, విశాఖ పరిపాలనా రాజధానికి రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధానికి ఉత్తరాంధ్ర వారంతా మద్దతు పలకాలన్నారు. జేఏసీ కార్యాచరణకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తూ రెచ్చగొట్టేలా అమరావతి రైతులు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టినవారు విశాఖ పరిపాలనా రాజధానిని అడ్డుకుంటున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని తెలిపారు. నర్సీపట్నం ఎమ్మెల్యే కాలు విరిగితే హేళన చేశారని, ఇప్పుడు అమరావతివారు ఈ ప్రాంతానికి వచ్చి అలాగే మాట్లాడితే జరిగే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనకాపల్లి ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ అమరావతి వాసులతో పాదయాత్ర చేయిస్తూ ప్రాంతీయ విద్వేషాలు సృష్టిస్తున్నదెవరో ఉత్తరాంధ్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ 29 గ్రామాల రైతులే రాష్ట్ర రాజధాని ఎక్కడుండాలో నిర్ణయిస్తే ఇక ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే.. ఏపీ భాజపా నాయకులు మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ భావితరాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణకు మద్దతు పలకాలని సూచించారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలని ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వ విప్‌, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ మూడు రాజధానులకు మద్దతుగా అనకాపల్లి జిల్లాలో సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తామన్నారు.  సమావేశంలో వివిధ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు