Andhra News: 3 రాజధానులకు మద్దతుగా ‘విశాఖ గర్జన’

విశాఖలో రాజధాని కావాలని ‘విశాఖ గర్జన’ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని మంత్రులు, వైకాపా నేతలు అన్నారు.

Published : 15 Oct 2022 17:41 IST

విశాఖపట్నం: విశాఖలో రాజధాని కావాలని ‘విశాఖ గర్జన’ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని మంత్రులు, వైకాపా నేతలు అన్నారు. అమరావతితో పాటుగా విశాఖ, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పానికి ఈ గర్జన ద్వారా ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. అధికార వికేంద్రీకరణకు 3 రాజధానుల సూత్రం బాగా పనిచేస్తుందన్న నేతలు.. దీనికోసం భవిష్యత్తులో ప్రజలు నినదించేలా కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ర్యాలీ పూర్తయిన తర్వాత పార్క్‌ హోటల్‌ జంక్షన్‌లో వైఎస్‌ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజా, కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌, గుడివాడ అమర్నాథ్‌, జోగి రమేష్‌, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు. 

వర్షం కారణంగా ర్యాలీకి ఆటంకం..

3 రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన అధికార పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు వర్షంలోనే ర్యాలీలో పాల్గొన్నారు. జోన్ల వారీగా బస్సులు ఏర్పాటు చేయడంతో ర్యాలీలో జనసందోహం కనిపించింది. ఎల్‌ఐసీ జంక్షన్‌ నుంచి సెవెన్‌హిల్స్‌ మార్గం మీదుగా సిరిపురం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, చిన వాల్తేరు నుంచి పార్క్‌ హోటల్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. వైకాపా యంత్రాంగం పెద్ద ఎత్తున జనసమీకరణపై దృష్టి పెట్టింది. మహిళా గ్రూపు సభ్యులు, విద్యార్థులు, నర్సింగ్‌ విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని