‘రాబోయే ఎన్నికల్లో భాజపాతోనే కలిసి నడుస్తాం’

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని కేంద్ర మంత్రి, ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ)’ అధినేత రామ్‌దాస్‌ అఠవాలే తెలిపారు.

Published : 28 Feb 2021 00:56 IST

ఆర్‌పీఐ అధినేత రామ్‌దాస్‌ అఠవాలే

లఖ్‌నవూ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపాతో కలిసి నడుస్తామని కేంద్ర మంత్రి, ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ)’ అధినేత రామ్‌దాస్‌ అఠవాలే తెలిపారు. అలాగే ఉత్తర్‌ప్రదేశ్‌లో 2022లో జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ భాజపాతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి చర్చిస్తామని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌పీఐకి 8-10 సీట్లు ఇవ్వగలిగితే.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)ని దీటుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని.. వారంతా ఆర్‌పీఐ వైపు చూస్తున్నారని తెలిపారు.

ఇక ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో కలిసి మాట్లాడతామని అఠవాలే తెలిపారు. ఒకవేళ భాజపా ఆర్‌పీఐకి సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే.. కొన్ని స్థానాల్లో సొంతంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు. మిగిలిన స్థానాల్లో భాజపాకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ జనాభాలో 36 శాతం దళితులేనని.. ఆర్‌పీఐ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల భాజపాకే కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా భీం ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతిని అఠవాలే తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం గమనార్హం. ఆజాద్‌ ఆర్‌పీఐలో చేరితే కీలక స్థానం ఇస్తామని తెలిపారు. అలాగే మాయావతి పార్టీలోకి వస్తే తన చేతిలో ఉన్న అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించి తాను ఉపాధ్యక్షునిగా ఉండిపోతానని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని అఠవాలే అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రంలో భాజపా 200కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ సహా ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో భాజపా విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్‌పైనా అఠవాలే విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ ఉన్నంత కాలం ఆ పార్టీకి భవిష్యత్తు లేదంటూ ఎద్దేవా చేశారు.

ఇక రైతుల ఆందోళనపై మాట్లాడిన అఠవాలే.. సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. చట్టాల రద్దు మాత్రం కుదరదని తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో భూమిలేని వారికి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే మహారాష్ట్రలో మరాఠాలు, హరియాణాలో జాట్లు, ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజ్‌పూత్‌లకు రిజర్వేషన్లలో 10-12 శాతం కోటా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక 2021 జనాభా లెక్కల్లో కుల సంబంధిత వివరాలను నమోదు చేయాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని